మరోసారి మా ఆదేశాలు ఉల్లంఘించ వద్దు.. అమరావతి పాదయాత్రికులకు హైకోర్టు హెచ్చరిక

Andhra Pradesh High Court warns Amaravati Padayatra People - Sakshi

ఇది రైతులకు మా ధర్మబద్ధమైన ఆదేశం.. ఉల్లంఘిస్తే అనుమతుల రద్దు కోసం కోర్టుకు రండి

పోలీసులకు స్పష్టీకరణ

600 మంది.. సంఘీభావం ఉత్తర్వులను సవరించాలన్న పిటిషన్‌ కొట్టివేత.. గత ఉత్తర్వుల సవరణకు హైకోర్టు నిరాకరణ

ఆ షరతులు సహేతుకమైనవే.. సవరణ సాధ్యం కాదు

యాత్రలో ఒకరి బదులు మరొకరు కుదరదు

గతంలో తీసుకోని వారికి గుర్తింపు కార్డులివ్వాలి

సంఘీభావం పేరుతో ఇతరులెవరూ వారితో కలసి పాల్గొనడానికి వీల్లేదు

తప్పును సరిదిద్దుకునే అవకాశం రైతులకిచ్చి ఉండాల్సిందని వ్యాఖ్య

సాక్షి, అమరావతి: రైతుల పేరుతో అమరావతి నుంచి అరసవల్లి వరకు పాదయాత్ర చేస్తున్న వారికి హైకోర్టు గట్టి షాక్‌నిచ్చింది. గత నెలలో ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలన్న పాద యాత్రికుల అభ్యర్థనను హైకోర్టు నిర్ధ్వందంగా తోసిపుచ్చింది. వాటిని సవరించేందుకు ఏ కారణం కనిపించడం లేదని తేల్చి చెబుతూ రైతులు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను కొట్టివేసింది.

వారు కోరిన విధంగా ఉత్తర్వులను సవరించడమంటే పాదయాత్రకు పలు షరతులతో అనుమతినిస్తూ ఈ ఏడాది సెప్టెంబర్‌ 9న ఇచ్చిన ప్రధాన ఉత్తర్వులను సవరించినట్లే అవుతుందని, అందువల్ల ఆ ప్రధాన ఉత్తర్వుల అమలు కోసం ఇటీవల ఇచ్చిన ఆదేశాలను సవరించడం ఎంత మాత్రం సాధ్యం కాదని స్పష్టం చేసింది.

పాదయాత్రలో కేవలం 600 మంది మాత్రమే పాల్గొనాలంటూ ఆ ఉత్తర్వుల్లో స్పష్టమైన షరతులు విధించారని న్యాయస్థానం గుర్తు చేసింది. అది కూడా డీజీపీకి ఇచ్చిన జాబితాలో ఉన్న వ్యక్తులే పాదయాత్రలో ఉండాలని సెప్టెంబర్‌ 9న ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించింది.

ఒకరి స్థానంలో మరొకరికి అనుమతి లేదు..
పాదయాత్రలో ఒకరి స్థానంలో మరొకరు పాల్గొనేందుకు అనుమతించాలన్న రైతుల అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ విషయంలో రైతులు కోరిన విధంగా అనుమతినిస్తే అది గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరించినట్లే అవుతుందని తేల్చి చెప్పింది.

యాత్రలో పాల్గొంటున్న 600 మంది కేవలం పోలీసులు జారీ చేసిన గుర్తింపు కార్డులే కాకుండా ప్రభుత్వం జారీ చేసిన ఇతర కార్డుల ద్వారా కూడా గుర్తింపును ధృవీకరించుకోవచ్చని పేర్కొంది. గతంలో తీసుకోని వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఇందుకోసం ప్రస్తుతం పాదయాత్ర జరుగుతున్న ప్రాంతం వద్ద కౌంటర్‌ ఏర్పాటు చేయాలని డీజీపీని ఆదేశించింది. 

వారితోపాటు పాల్గొనేందుకు వీల్లేదు..
పాదయాత్రకు ఇచ్చిన అనుమతిని ఏ రకంగానూ దుర్వినియోగం చేయడానికి వీల్లేదని హైకోర్టు పేర్కొంది. పాదయాత్ర సజావుగా సాగిపోయేందుకు హైకోర్టు విధించిన షరతులు సహేతుకమైనవని తెలిపింది. పాదయాత్రలో కేవలం 600 మంది మాత్రమే పాల్గొనాలని స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఓ వ్యక్తి రైతులతో కలిసి యాత్రలో పాల్గొని సంఘీభావం తెలపవచ్చా? అన్న ప్రశ్న నిరర్థకమంది.

ఏ వ్యక్తైనా రోడ్డుకు ఇరువైపులా నిల్చొని సంఘీభావం తెలియచేయవచ్చు, వారితో పాటు కలసి పాదయాత్రలో పాల్గొనడానికి మాత్రం వీల్లేదని స్పష్టం చేసింది. ఇది మినహా సంఘీభావం తెలిపే విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవంది. అయితే పోలీసులకు అదనపు ఆదేశాలు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. 

మరోసారి ఉల్లంఘిస్తే...
పాదయాత్ర నిర్వహణకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని కోరుతూ డీజీపీ దాఖలు అనుబంధ పిటిషన్‌ను హైకోర్టు పరిష్కరించింది. నిరసన తెలియచేయడం పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ముఖ్యమైన హక్కు అని హైకోర్టు తెలిపింది. చాలా ఆలోచించి, జాగ్రత్తగా ఇలాంటి హక్కుల విషయంలో జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని హైకోర్టు గుర్తు చేసింది.

ప్రస్తుత కేసులో రైతులు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినప్పటికీ, వాటిని ప్రైవేట్‌గా రికార్డ్‌ చేయడం మినహా వారి దృష్టికి తెచ్చి తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఇవ్వలేదని హైకోర్టు ఆక్షేపించింది. తప్పు సరిదిద్దుకునే అవకాశం రైతులకు ఇవ్వకుండా పాదయాత్రను అడ్డుకోవడం ఎంతమాత్రం సహేతుకం కాదంది. అయితే ఇది కోర్టు ఆదేశాలను, డీజీపీ ఇచ్చిన అనుమతులను యథేచ్ఛగా ఉల్లంఘించేందుకు ఇచ్చిన స్వేచ్ఛగా భావించడానికి వీల్లేదని రైతులకు తేల్చి చెప్పింది.

కోర్టు ఆదేశాలు, డీజీపీ అనుమతులకు సంబంధించి పూస గుచ్చినట్లు జరిగిన వాదనలను రైతులు గమనించారనే తాము భావిస్తున్నామంది. ఈ నేపథ్యంలో యాత్ర చేస్తున్న రైతులకు ధర్మబద్ధమైన హెచ్చరిక చేస్తున్నామని, కోర్టు ఆదేశాలను ఇకపై ఉల్లంఘిస్తే యాత్రకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలంటూ పోలీసులు హైకోర్టును ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందన్‌రావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఇవీ అనుబంధ పిటిషన్లు...
తమ పాదయాత్రకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇబ్బందులు కలిగించకుండా ఆదేశించడంతో పాటు పోలీసులు చట్ట ప్రకారం విధులు నిర్వర్తించేలా ఆదేశించాలంటూ అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి గద్దె తిరుపతిరావు మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై గత నెల 21న విచారణ జరిపిన జస్టిస్‌ రఘునందన్‌రావు.. పాదయాత్రలో కేవలం 600 మంది మాత్రమే పాల్గొనాలని ఆదేశించారు.

సంఘీభావం పేరుతో ఇతరులెవ్వరూ పాదయాత్రలో పాల్గొనడానికి వీల్లేదన్నారు. ఈ ఆదేశాల పేరుతో పోలీసులు తమను ఇబ్బంది పెడుతున్నారని, వాటిని సవరించాలంటూ అమరావతి పరిరక్షణ సమితి అనుబంధ పిటిషన్‌ దాఖలు చేసింది. ఇదే సమయంలో పాదయాత్రకు ఇచ్చిన అనుమతి రద్దు చేయాలంటూ డీజీపీ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ రెండు వ్యాజ్యాలను విచారించిన అనంతరం హైకోర్టు తాజా ఆదేశాలను జారీ చేసింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top