
సాక్షి, అమరావతి: ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీసు వ్యవస్థలో పలు సంస్కరణలు తెస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో మహిళా పోలీసు వ్యవస్థను అందుబాటులోకి తేవడంతోపాటు రాష్ట్రంలో జీరో ఎఫ్‌ఐఆర్ విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. సంస్కరణల్లో భాగంగా పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాల్లో పర్యాటకులు, యాత్రికుల భద్రత కోసం టూరిస్ట్ పోలీసు స్టేషన్లను తాజాగా అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించారు.
రాష్ట్రవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో టూరిస్ట్ పోలీసు స్టేషన్లను మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్ వరŠుచ్యవల్ విధానంలో ప్రారంభించారు. ఫిర్యాదు చేసేందుకు పోలీసు స్టేషన్‌కు వచ్చే ప్రజలకు గతానికి భిన్నంగా సుహృద్భావ వాతావరణాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. పోలీసులు ప్రజల స్నేహితులనే భావన కలిగేలా రిసెప్షనిస్టులను నియమించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఇంకా ఏమన్నారంటే...
పర్యాటకులకు సౌకర్యాలు, భద్రత
పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించే వారి భద్రత కోసం ప్రత్యేకంగా 20 ప్రాంతాలను గుర్తించి కియోస్క్‌లు ఏర్పాటు చేశాం. అవి స్ధానిక పోలీస్ స్టేషన్‌కు అనుబంధంగా 20 అదనపు పోలీస్ స్టేషన్లుగా పని చేస్తాయి. ప్రతి కియోస్క్‌లో ఆరుగురు సిబ్బంది రెండు షిప్టుల్లో విధులు నిర్వహిస్తారు. దీన్ని ఎస్‌ఐ లేదా ఏఎస్‌ఐ స్ధాయి అధికారి పర్యవేక్షిస్తారు. ఆపదలో చిక్కుకునేవారు సంప్రదించేందుకు ప్రత్యేకంగా టెలిఫోన్ నంబరు డిస్‌ప్లే చేస్తారు. కియోస్క్‌లలో సిబ్బందికి ప్రత్యేక టెలిఫోన్ నెంబరు, రేడియో సెట్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఆ ప్రాంతానికి సంబంధించిన మ్యాపు, వాహనాల సదుపాయం కల్పించాం. పర్యాటకులు, యాత్రికులు నిర్భయంగా గడిపేలా భరోసా కల్పిస్తూ టూరిస్ట్ పోలీసు స్టేషన్లు పని చేస్తాయి. పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదన్న తపనతో ఇవన్నీ చేస్తున్నాం. పోలీసుశాఖలో ఇది సువర్ణాధ్యాయం. పోలీస్ శాఖలో గొప్ప సంస్కరణగా నిలుస్తుంది.
అక్క చెల్లెమ్మలకు తోడుగా మహిళా సిబ్బంది...
టూరిస్ట్ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించే సిబ్బందిలో సగం మంది మహిళలు ఉన్నారు. ఎవరైనా అక్కచెల్లెమ్మలు ఆ కియోస్క్‌లకు వెళ్లినప్పుడు మహిళా సిబ్బంది వారికి తోడుగా నిలబడతారు. ఇవన్నీ మంచి పరిణామాలు. దిశ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే పోలీసు సోదరుడు మీకు తోడుగా ఉన్నట్లేనని భరోసా కల్పించేందుకు కరపత్రాలు కూడా ఆ ప్రాంతంలో అందుబాటులో ఉంచుతారు. వీటన్నింటి వల్ల పర్యాటకులందరికీ మంచి జరుగుతుంది. ఈ పోలీస్ స్టేషన్లలో పనిచేసేవారు అంకిత భావంతో, సేవా భావంతో విధులు నిర్వహించాలని ఆకాంక్షిస్తున్నా.
దిశ యాప్ డౌన్‌లోడ్లు 1.20 కోట్లు
దిశ యాప్‌ను ఇప్పటికే దాదాపు 1.20 కోట్ల మందికిపైగా డౌన్‌లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్
చేసుకున్నారు. అక్క చెల్లెమ్మలు ఆపదలో ఉన్నప్పుడు ఫోన్‌ను ఐదు సార్లు షేక్ చేసినా.. ఓఎస్ బటన్ నొక్కినా.. పది నిమిషాల్లోనే పోలీసులు అక్కడకు చేరుకుని భద్రత కల్పిస్తారు. ఇలా ఇప్పటివరకు సహాయం కోరిన దాదాపు 6 వేల మందికి రక్షణ కల్పించి అండగా నిలిచారు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా పోలీసుశాఖలో కనిపిస్తున్న మంచి మార్పులు ఇవి.
పర్యాటకులకు పూర్తి భద్రత: హోంమంత్రి తానేటి వనిత
రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు పూర్తి భద్రత కల్పించేందుకు టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని హోంమంత్రి తానేటి వనిత తెలిపారు. పర్యాటకులకు అత్యవసర సాయం అందించేందుకు టూరిస్ట్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు శుభపరిణామన్నారు. మహిళల భద్రత కోసం దేశంలో విప్లవాత్మక రీతిలో దిశ వ్యవస్థను తీసుకొచ్చి ముఖ్యమంత్రి జగన్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని ప్రాంతాల్లో టూరిస్ట్ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేస్తామని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.
టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు ఇలా..
+ విశాఖపట్నం జిల్లా: ఆర్కే బీచ్
+ కాకినాడ జిల్లా: కుక్కుటేశ్వర స్వామి దేవాలయం
+ తూర్పు గోదావరి జిల్లా: పుష్కర ఘాట్
+ ఏలూరు జిల్లా: ద్వారకా తిరుమల
+ కృష్ణా జిల్లా: మోపిదేవి సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం, మంగినపూడి బీచ్
+ ఎన్టీఆర్ జిల్లా: విజయవాడ కనకదుర్గ ఆలయం, భవానీ ద్వీపం, పవిత్ర సంగమం ఘాట్
+ ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా: మైపాడు బీచ్, పెంచలకోన దేవాలయం
+ కర్నూలు జిల్లా: మంత్రాలయం దేవాలయం
+ నంద్యాల జిల్లా: మహానంది, ఆహోబిలం ఆలయం
+ అన్నమయ్య జిల్లా: హార్సిలీ హిల్స్
+ వైఎస్సార్ జిల్లా: గండికోట, ఒంటిమిట్ట దేవాలయం
+ శ్రీసత్యసాయి జిల్లా: లేపాక్షి దేవాలయంలతోపాటు మరో రెండు పర్యాటక ప్రాంతాలు.