APCO: కేరళ కుట్టిలకు ఆంధ్రా వస్త్రాలు

Andhra Pradesh cloths for Kerala womens - Sakshi

ఆప్కోతో కేరళ చేనేత విభాగం ఒప్పందం 

మలయాళీ సర్కారుకు చెందిన 30 స్టాల్స్‌లో అమ్మకాలు  

ఇప్పటికే రూ.29.50 లక్షల విలువైన వస్త్రాలు కొనుగోలు 

సాక్షి, అమరావతి: మలయాళీ సీమలో ఆంధ్రా చేనేత వస్త్రాల విక్రయానికి రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ఆప్కోతో కేరళ స్టేట్‌ హ్యాండ్లూమ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (హ్యాండ్‌ వీవ్‌) ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థ చైర్మన్‌ గోవిందన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అరుణాచలం సుకుమార్, మార్కెటింగ్‌ మేనేజర్‌ సందీప్‌ రెండు రోజుల క్రితం ఏపీలో పర్యటించి చేనేత వస్త్రాల తయారీ, ఆప్కో ద్వారా విక్రయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆప్కో చైర్మన్‌ చిల్లపల్లి వెంకట నాగమోహనరావు, వీసీ అండ్‌ ఎండీ చదలవాడ నాగరాణితో చర్చించారు.

ఏపీలో చేనేత వస్త్రాలు, వాటి డిజైన్లు, నాణ్యత బాగున్నాయని, వాటిని కేరళలోని స్టాల్స్‌లో విక్రయిస్తామని వెల్లడించారు. ఈ ఒప్పందంలో భాగంగా కేరళ ప్రభుత్వం చేనేత సొసైటీల కోసం నిర్వహిస్తున్న 30 అధికారిక స్టాల్స్‌లో ఏపీ చేనేత వస్త్రాలను విక్రయించనున్నారు. ఏపీలో చేనేతకు బ్రాండ్‌ ఇమేజ్‌ తెచ్చిపెడుతున్న పొందూరు, ఉప్పాడ, పెడన, మంగళగిరి, ధర్మవరం, వెంకటగిరి తదితర ప్రాంతాలకు చెందిన వస్త్రాలను కేరళలోని స్టాల్స్‌లో విక్రయాలకు ఉంచనున్నారు. ప్రధానంగా కేరళలో ఘనంగా నిర్వహించే ఓనం, క్రిస్మస్, రంజాన్‌ మాసాల్లో ఏపీ చేనేత వస్త్రాలను అత్యధికంగా విక్రయించేలా ఆప్కో కార్యాచరణ చేపట్టింది.  

కలంకారీ వస్త్రాలను కొనుగోలు చేసిన హెన్‌టెక్స్‌ 
కాగా, కేరళ రాష్ట్రానికి చెందిన హెన్‌టెక్స్‌ (కేరళ స్టేట్‌ హ్యాండ్లూమ్‌ వీవర్స్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌) ఇప్పటికే ఏపీ చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి తీసుకెళ్లింది. నాలుగు రోజుల క్రితం పెడనలో పర్యటించిన హెన్‌టెక్స్‌ బృందం కలంకారీ వస్త్రాలపై అమితాసక్తి చూపించింది. పెడన కలంకారీ డిజైన్లతో కూడిన రూ.29.50 లక్షల విలువైన వస్త్రాలను కొనుగోలు చేయడం గమనార్హం. 

చేనేతకు ఊతమివ్వడమే లక్ష్యం 
రాష్ట్రంలోని చేనేత పరిశ్రమకు ఊతమిచ్చేందుకు అనేక చర్యలు చేపడుతున్నాం. ఇందులో భాగంగానే కేరళలోని ప్రభుత్వ అధికారిక స్టాల్స్‌లో ఏపీ చేనేత విక్రయాలు జరిపేలా చర్యలు  తీసుకున్నాం. ఏపీ చేనేత సొసైటీల ప్రతినిధులు కేరళలోని స్టాల్స్‌కు వస్త్రాలు సరఫరా చేసి, నెలలోపులోనే విక్రయాలకు సంబంధించిన మొత్తాలను తిరిగి పొందేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసినందుకు ఆప్కోకు కేవలం 2 శాతం సర్వీస్‌ రుసుం వసూలు చేస్తాం.  
– చిల్లపల్లి వెంకట నాగమోహనరావు, ఆప్కో చైర్మన్‌   
చదవండి: ఆలయాలకు 'ప్రకృతి' ఉత్పత్తులు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top