వైకల్యం చిన్నబోయింది!

Anantapur Man Beats His Disability With Empowerment - Sakshi

చదువు లేదు.. నడవడం కూడా సరిగ్గా రాదు ఎలా బతుకుతావు రా నువ్వు’ అంటూ చుట్టుపక్కల వారు హేళన చేస్తుంటే ఆ దివ్యాంగుడి హృదయం తల్లడిల్లిపోయేది. కానీ ఆ మాటలే అతన్ని స్వశక్తిపై నడిపించాయి. దివ్యాంగుని సంకల్పం ముందు వైకల్యం తల వంచింది. శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగా ఉండీ.. పరులపై ఆధారపడే ఎందరో ఉన్న నేటి సమాజంలో ఓ దివ్యాంగుడు తన స్వశక్తిపై జీవించడమే కాక మరో రెండు కుటుంబాలకు ఉపాధి కల్పించడం గొప్ప విషయం. ఛీదరింపులు.. ఛీత్కారాలను ఎదుర్కొంటూ గేలి చేసిన నోళ్లు మూతపడేలా ఎదిగిన షాషావలి విజయప్రస్థానంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

సాక్షి, అనంతపురం కల్చరల్‌: జిల్లా కేంద్రం అనంతపురం నగరంలోని మున్నానగర్‌కు చెందిన రసూల్‌బీ, అబ్దుల్‌ సత్తార్‌ దంపతులకు ఇద్దరు సంతానం. వీరిలో పెద్దవాడు ఖాదర్‌వలి, రెండోవాడు షాషావలి. అబ్దూల్‌సత్తార్‌ బొరుగుల బట్టీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. బాల్యంలోని మధురానుభూతులను మూటగట్టుకున్న తరుణంలో షాషావలి (ఐదేళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు) పోలియో మహమ్మారి బారిన పడ్డాడు. ఓ కాలు అవిటిదైంది. చాలా రోజుల పాటు ఇంటికే పరిమితమయ్యాడు. పేదరికం కారణంగా సరైన చికిత్సలు కూడా అందించలేని దుర్భర స్థితిలో అబ్దుల్‌సత్తార్‌ దంపతులు విలవిల్లాడారు.  

చిరుప్రాయంలోనే వివక్ష: తన ఈడు పిల్లలు వీధిలో ఎంతో ఉల్లాసంగా గెంతుతూ.. ఆడుకుంటూ ఉంటే షాషావలి హృదయం మూగగా రోదించేది. అమ్మా నేను కూడా వారిలా ఆడుకుంటా కదూ? నా కాలు బాగవుతుంది కదూ? అంటూ అమాయకంగా అతను ప్రశ్నిస్తుంటే ఆ తల్లి చెంగు చాటున కన్నీళ్లు వరదై ప్రవహించేవి. బిడ్డ ఇలాగే ఉంటే మానసికంగా మరింత బలహీనుడవుతాడని భావించిన తల్లిదండ్రులు నగరంలోని పాతూరు నంబర్‌ 1 స్కూల్‌లో చేర్పించారు. అయితే పాఠశాలలో తోటి విద్యార్థులు ఎగతాళి చేస్తూ సూటిపోటి మాటలు అంటుంటే భరించలేకపోయాడు. ‘యా అల్లా... నేనేమి పాపం చేశాను. నాకేందుకు ఈ శిక్ష’ అంటూ బాధపడుతూ అందరూ ఉన్నా.. పాఠశాలలో ఒంటరిగానే మిగిలిపోయాడు. చివరకు ఐదో తరగతితో చదువులను అటకెక్కించి, ఏదో ఒక పనిచేసుకుని జీవించాలనుకున్నాడు.    

అడుగడుగునా ఛీదరింపులే: షాషావలి పనికి పోయిన చోటల్లా ఛీదరింపులు చవిచూడాల్సి వచ్చింది. ‘నువ్వేం పనికొస్తావు’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతుంటే తాను ఎందులోనూ తక్కువ కాదని నిరూపించాలనే కసితో ఎదగడం మొదలెట్టాడు. ఓ సైకిల్‌ షాప్‌లో పంచర్‌లు వేయడంతో మొదలు పెట్టిన జీవిత ప్రస్థానం...  తర్వాత టైలరింగ్‌ వైపు మళ్లింది.  అక్కడ కూడా ఛీత్కారాలు ఎదుర్కొన్నాడు. దుకాణానికి వచ్చే కస్టమర్ల ఎదుట షాషావలి తిరుగుతుంటే యజమాని నామోషీగా ఫీలవుతూ చీదరించుకునేవాడు. ఈ మాటలు పడలేక చివరకు అక్కడ కూడా పని మానేశాడు. ఆ తర్వాత రెండేళ్లు శ్రీకంఠం సర్కిల్‌ సమీపంలోని ఓ వెల్డింగ్‌ షాప్‌లో పనికి చేరాడు. అక్కడ కూడా అవే అవమానాలు.. ఛీత్కారాలు. రోజుకు రూ.5 కూలి ఇచ్చేవాడు. అక్కడ ఈసడింపులు భరించలేక కొన్నాళ్లు ఎలక్ట్రికల్‌ వర్క్‌ నేర్చుకునేందుకు వెళ్లాడు. ఇక్కడ కూడా షరామాములే. చివరకు గుత్తిరోడ్డులోని శివారెడ్డి వెల్డింగ్‌ షాప్‌లో పనికి చేరాడు. ఏడేళ్లపాటు అక్కడే ఉంటూ వివిధ రకాల గృహోపకరణాలు చేయ­డం నేర్చుకున్నాడు.

పోటీ నుంచి తప్పించాలని 
సహజంగా ఒకరు ఎదుగుతుంటే ఓర్వలేని ఎంతో మంది అవాంతరాలు సృష్టిస్తూనే ఉంటారు. ఇదే విషయం షాషావలి జీవితంలోనూ ఎదురైంది. ఎలాగైనా అతన్ని పోటీ నుంచి తప్పించాలని పలువురు ముమ్మర ప్రయత్నాలు చేశారు. అక్కడి నుంచి అతన్ని ఖాళీ చేయించేందుకు కుట్రలు పన్నారు. ఇలాంటి తరుణంలోనే కనీస సానుభూతి ఉంటుందనే కారణంతో తన దుకాణానికి ‘అనంత వికలాంగుల ఆధ్వర్యంలో’ అనే బోర్డు ఏర్పాటు చేసుకున్నాడు. అయినా అడ్డంకులు ఆగడం లేదు. ఇప్పటికే ఆ స్థలాన్ని ఖాళీ చేయాలంటూ అధికారులతో నోటీసులిప్పించారంటే వికలాంగుల పట్ల ఎంత వివక్ష కనబరుస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

జీవితమే  ఆదర్శం  
కర్నూలుకు చెందిన రేష్మా అనే పోలియో బాధితురాలిని పెళ్లి చేసుకోవాలని షాషావలి అనుకున్నాడు. ఇద్దరూ వికలాంగుౖలైతే కష్టమని బంధువులు వారించినా అతను రేష్మాను ఇష్టపడి 2010లో పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వారికొక కొడుకు ఉన్నాడు. ఒకటో తరగతి చదువుతున్నాడు. స్వశక్తిపైన జీవించాలనే తపన అతన్ని సొంతంగా వెల్డింగ్‌ షాపు పెట్టుకునేలా చేసింది.

కలెక్టర్‌ ప్రోత్సాహంతో..  
అప్పటి కలెక్టర్‌ వీరపాండియన్‌ ప్రోత్సాహంతో కలెక్టరేట్‌ ఎదురుగా చెరువుకట్టపై (ఇస్కాన్‌ గోశాల ఎదురుగా) సొంతంగా వెల్డింగ్‌ షాపును షాషావలి పెట్టాడు. గ్రిల్స్, షెడ్సు, సేఫ్టీ డోర్స్, స్టేర్‌ కేసులు తదితర బరువైన పనులను అవలీలగా చేస్తున్నాడు. దాదాపు 500 కిలోల బరువైన గృహోపకరణాలను ఒంటరిగా చేస్తూ అందరిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. తన షాప్‌లో మరో రెండు కుటుంబాలకు ఉపాధి కల్పించాడు.

వీలైతే సాయం చేయండి
ఎన్నో ప్రతికూల పరిస్థితులను నెగ్గుకొని సొంతంగా జీవించేందుకు ప్రయత్ని స్తున్నా. నేను నా భార్య ఇద్దరమూ దివ్యాంగులమే. అయినా కరుణ లేకుండా కొందరు మా పొట్ట కొట్టాలని చూస్తున్నారు. నా పనితనం చూసి చాలాసార్లు అధికారులే ఆశ్చర్యపోయారు. కానీ ఏం లాభం? నేను డబ్బు కోసమో, నాకే పనులివ్వాలనో ఎవరినీ యాచించలేదు. నా కష్టంపై నేను జీవిస్తున్నా. నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు. 
– షాషావలి, వెల్డర్, అనంతపురం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top