‘స్పందన’ తలుపులు తెరిచే ఉంటాయ్‌..

Anakapalle District SP Gowthami Sali Life Story, Inspiring Journey - Sakshi

ఏ రోజైనా ఫిర్యాదు చేయొచ్చు

అనకాపల్లి ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణపై ప్రత్యేక దృష్టి

వారంలో రెండు రోజులు స్టేషన్ల సందర్శన

జిల్లా సరిహద్దుల్లో నిఘా పటిష్టం

గంజాయి, నాటుసారాపై ఉక్కుపాదం

‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఎస్పీ గౌతమి సాలి

సాక్షి, విశాఖపట్నం : దేశానికి అన్నం పెట్టే రైతు కుటుంబం.. చదువు ఇంజినీరింగ్‌.. మంచి కంపెనీలో ఉద్యోగం.. అయినా ఏదో లోటు.. ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వాటిని పరిష్కరించడంలో ఆత్మ సంతృప్తి ఉందంటూ అర్థం చేసుకున్న ఆమె లక్ష్యం వైపుగా అడుగులు వేశారు. ఆమె అకుంఠిత దీక్ష ఫలితమే ఐపీఎస్‌. వినేందుకు మూడక్షరాలే అయినా.. ఆ స్థాయికి చేరుకునేందుకు కొండంత తెగువ కావాలి.. గుండెల నిండా ధైర్యం ఉండాలి. ఆ రెండింటినీ మేళవిస్తూ.. గౌతమి ఐపీఎస్‌గా లక్ష్యానికి చేరువయ్యారు. ప్రతి పోస్టింగ్‌లోనూ సవాళ్లని ఎదుర్కొంటూ అనకాపల్లి జిల్లాకు మొట్టమొదటి సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌గా నియమితులయ్యారు. ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అమలుకు.. ట్రాఫిక్‌ పద్మవ్యూహాన్ని ఛేదించేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేశారు.. ఈ విషయాలను ఎస్పీ గౌతమి సాలి ‘సాక్షి’తో పంచుకున్నారు. 

నన్ను మా నాన్నగారే ముందుండి నడిపించారు. చిత్తూరు జిల్లా పెద్ద కన్నెలి గ్రామంలో పుట్టాను. జెడ్పీ హైస్కూల్‌లో 10వ తరగతి వరకూ, ఇంటర్‌ ప్రైవేట్‌ కాలేజీలో చదివిన తర్వాత ఎస్‌వీ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ (ఈసీఈ) చదివాను. ఫైనలియర్‌లో ఉన్నప్పుడు కాగ్నిజెంట్‌లో ప్లేస్‌మెంట్‌ సాధించాను. చెన్నైలో ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించాను. ప్రతి అడుగులోనూ నాన్న వేణుగోపాల్, అమ్మ కల్యాణి ఆత్మస్థైర్యాన్ని నూరిపోసేవారు. ఇంజినీరింగ్‌ చదువుతున్నప్పుడు అమ్మ చనిపోయిన తర్వాత నాన్నే మమ్మల్ని నడిపించారు. ఎంఏ ఎంఫిల్‌ చేసినా.. వ్యవసాయం చేస్తూనే మమ్మల్ని పెంచి పోషించారు.  

రెండోసారి ర్యాంకు సాధించాను 
జాబ్‌ చేస్తూ.. మంచి పొజిషన్‌లో ఉన్నప్పటికీ జీవితంలో ఏదో వెలితి ఉన్నట్లుగా అనిపించింది. సమాజానికి దగ్గరవ్వాలంటే ఐఎఎస్, ఐపీఎస్‌ అవ్వాలని నిర్ణయించుకున్నాను. జాబ్‌ చేస్తూనే యూపీఎస్సీకి ప్రిపేర్‌ అయ్యాను. తొలిసారి 2012లో రాశాను. కానీ ర్యాంకు సాధించలేకపోయాను. ఆ తర్వాత ఇంట్లో వాళ్ల మీద ఆధారపడకుండా.. నాకు వస్తున్న జీతంతోనే జీవితాన్ని సాగిస్తూ.. వీకెండ్స్‌ కోచింగ్‌ తీసుకుంటూ.. కష్టపడి చదివాను. 2013లో పరీక్ష రాయలేదు. 2014లో 783 ర్యాంకు సాధించాను. 

మొదటి పోస్టింగ్‌ కడపలో.. 
కడప జిల్లాలో ఏఎస్పీ ట్రైనీగా మొదటి పోస్టింగ్‌ వచ్చింది. ఆ తర్వాత విశాఖపట్నంలో అసాల్ట్‌ కమాండర్‌ గ్రేహౌండ్స్, బొబ్బిలి ఏఎస్పీ.. ఆ తర్వాత కర్నూలు అడిషనల్‌ ఎస్పీ(అడ్మిన్‌)గా, ఆ తర్వాత స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోలో జాయింట్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించాను. తర్వాత విశాఖపట్నం డీసీపీగా పనిచేశాను. ఇప్పుడు అనకాపల్లి జిల్లా ఎస్పీగా వ్యవహరిస్తున్నాను. 

స్థానిక పరిస్థితులపై దృష్టి సారిస్తాను... 
ఇప్పటి వరకూ నగర పరిధుల్లో విధులు నిర్వర్తించాను. కానీ.. అనకాపల్లి జిల్లా దానికి పూర్తి విభిన్నం. ముందుగా స్థానిక పరిస్థితుల్ని అర్థం చేసుకుంటున్నాను. అనకాపల్లితో పాటు ప్రతి మండలం, గ్రామ స్థితిగతులు, సమస్యాత్మక ప్రాంతాలు మొదలైన అంశాలన్నింటినీ వీలైనంత త్వరగా ఆకళింపు చేసుకొని.. పోలీస్‌ వ్యవస్థపై ప్రజలకు మరింత గౌరవం పెరిగేందుకు  కృషి చేస్తాను. 

ఎప్పుడైనా వచ్చి ఫిర్యాదులందివ్వండి.. 
జిల్లా ఎస్పీ కార్యాలయం ప్రజల కోసం నిరంతరం పనిచేస్తుంటుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఎప్పుడైనా వచ్చి ప్రజలు తమ ఫిర్యాదుల్ని స్పందన సెల్‌లో అందించవచ్చు. ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ముందుగా స్పందన సెల్‌ని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రారంభించాం. అదేవిధంగా జిల్లాలోని ప్రతి పౌరుడు 24 గంటల్లో ఎప్పుడు ఏ శాంతిభద్రతలకు సంబంధించిన సహాయం కావాలన్నా ప్రతి పోలీస్‌ స్టేషన్‌ తలుపులు తెరిచే ఉంటాయి. వచ్చే ఫిర్యాదుని వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారుల్ని ఆదేశించాను. 

‘అక్రమం’పై ఉక్కుపాదం 
గ్రామీణ ప్రాంతం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్రమ మద్యం రవాణా, నాటుసారా, గంజాయి, గుట్కా, ఖైనీ మొదలైన వాటిన్నింటిపైనా ఉక్కుపాదం మోపుతాం. సరిహద్దుల్లో నిరంతర నిఘా వ్యవస్థను పటిష్టం చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ జరగకుండా నిరోధిస్తాం. చెక్‌పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించాం. నాటుసారా తయారు చేసే గ్రామాల జాబితాని తీసుకున్నాను. దానికనుగుణంగా ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తున్నాం. మూడు రోజుల వ్యవధిలో 4 వేల లీటర్ల బెల్లంపులుపుని ధ్వంసం చేశాం. 

‘దిశ’పై దృష్టి సారిస్తాం... 
దిశ పోలీస్‌ స్టేషన్‌ ఇప్పటికే అనకాపల్లిలో ఉంది. దిశ యాప్‌ని మహిళలందరి ఫోన్‌లో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించాం. దానికనుగుణంగా ప్రతి కాలేజీలు, ఇతర ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తున్నాం. మహిళలకు రక్షణ కల్పించేందుకు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటాం. అదేవిధంగా.. జిల్లాలో సైబర్‌ క్రైమ్‌ రేట్‌ ఎలా ఉంది అనే గణాంకాల ఆధారంగా ప్రత్యేక సెల్‌ఏర్పాటు చేయాలా లేదా అనేదానిపై నిర్ణయం తీసుకుంటాం. 

మండలాల వారీగా అధ్యయనం.. 
అనకాపల్లి పట్టణ ప్రాంతంతో పాటు గ్రామీణ ప్రాంతం మిళితమై ఉంటుంది. ఆయా ప్రాంతాలకు తగినట్లుగా పోలీసింగ్‌ వ్యవస్థ సేవల్లో మార్పులు చేర్పులు చేపట్టాలి. జిల్లా కేంద్రంగా ఏర్పాటైన తర్వాత.. ట్రాఫిక్‌ పెరిగే అవకాశం ఉంది. ఏ టైమ్‌లో ట్రాఫిక్‌ పెరుగుతోంది, స్కూల్స్‌ దగ్గర ట్రాఫిక్‌ ఎలా ఉంది.? ఎక్కడ సమస్య ఉత్పన్నమవుతోంది.. ఇలాంటివన్నీ పరిగణనలోకి తీసుకొని క్రమబద్ధీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. మండలాల వారీగా ఆయా ప్రాంతాల పరిస్థితుల్ని అధ్యయనం చేస్తున్నాం. దానికనుగుణంగా మార్పులు చేయాలని భావిస్తున్నాం. సమయం దొరికినప్పుడల్లా వారంలో రెండు మూడు పోలీస్‌ స్టేషన్లని సందర్శించి.. ప్రజలకు సేవలు అందుతున్నాయా లేదా అనేది నిరంతరం పర్యవేక్షిస్తా. జిల్లాలో శాంతి భద్రతల పరరిక్షణకు అనునిత్యం శ్రమించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్‌ యంత్రాంగం అడుగులు వేస్తుంది. 

టీచర్‌ ప్రోత్సాహంతోనే..
సివిల్‌ సర్వీస్‌ అనేది ఒకటి ఉంటుందని నాకు పరిచయం చేసింది మాత్రం విజయశ్రీ మేడం. ఆమె ఇంట్లో సాయంత్రం పూట చదువుకునేటప్పుడు సివిల్‌ సర్వీసెస్‌ అనేది చాలా కష్టమైన పరీక్ష. అందులో పాసైతే.. ప్రజలకు సేవ చేయవచ్చు అని చెప్పారు. అప్పటి నుంచి నా మనసులో సివిల్స్‌పై బీజం నాటుకుంది. ఆ బీజానికి అమ్మ నీరు పోసి పెంచింది. అమ్మాయిలు బాగా చదువుకుంటేనే సమాజంలో గొప్పగా గౌరవం పొందగలరని మమ్మల్ని ప్రోత్సహించేవారు. ఆమె వెన్నుతట్టి ప్రోత్సహించడం వల్లనే నేను ఐపీఎస్‌గా, మా సోదరి మౌనిక కెనరాబ్యాంక్‌లో ఉద్యోగిగా గౌరవం పొందగలిగాం. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top