గత ప్రభుత్వం పేదలను గాలికొదిలేసింది

Additional Advocate General Ponnavolu Sudhakar Reddy on CRDA lands - Sakshi

అందుకే వారికి రాజధానిలో సెంటు భూమి కూడా కేటాయించలేదు

పేదల నివాసాలకు ఐదు శాతం భూమి కేటాయించాలని చట్టం చెబుతోంది 

కానీ, మాస్టర్‌ ప్లాన్‌లో మాత్రం ఎలాంటి భూమి కేటాయించలేదు 

ఆ తప్పును సరిచేసేందుకే ఇప్పుడు ఆర్‌ 5 జోన్‌ను ఏర్పాటుచేశాం 

తమ పక్కన పేదలు, అణగారిన వర్గాలు ఉండకూడదని రాజధాని రైతులు అంటున్నారు 

అందుకే ఆర్‌ 5 జోన్‌ను వ్యతిరేకిస్తున్నారు.. హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం 

వ్యాజ్యాన్ని త్రిసభ్య ధర్మాసనానికి నివేదించిన న్యాయమూర్తి 

తగిన ఉత్తర్వుల కోసం ఫైల్‌ను సీజే ముందుంచాలని రిజిస్ట్రీకి ఆదేశం

సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలోని మొ­త్తం విస్తీర్ణంలో ఐదు శాతం భూమిని పేద­ల నివాసాల నిమిత్తం కేటాయించాలని సీఆ­ర్‌­డీఏ చట్టం స్పష్టంగా చెబుతోందని, అయి­తే గత ప్రభుత్వం మాత్రం పేదలను గాలికొదిలేసిందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొ­కేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. పేద­ల కోసం రాజధాని ప్రాంతంలో సెంటు భూమి కూడా కేటాయించలేదని, ఆ తప్పును తాము ఇప్పుడు సరిచేసి, చట్టానికి అనుగుణంగా 5 శాతం భూమిని పేదల నివాసకల్పన కోసం కేటాయించామని చెప్పారు.

చట్ట ప్రకారం వ్యవహరించడం కూడా తప్పు అంటూ పిటిషన్‌ దాఖలు చేశారని ఆయన వివరించారు. పేదలులేని ప్రపంచస్థాయి రాజ­దాని కావాలని రాజధాని రైతులు కోరుకుం­టున్నారని, తాము మాత్రం పేదలు సైతం రాజధానిలో ఇళ్లు కట్టుకుని ఉండాలని కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. ఇందులో భాగంగానే పేదల కోసం ఆర్‌ 5 జోన్‌­ను ఏర్పాటుచేసి, వందల ఎకరాల భూమిని కేటాయించామన్నారు. రాజధాని రైతుల వా­ద­నను పరిగణనలోకి తీసుకోవద్దని ఆయ­న హైకోర్టును అభ్యర్థించారు. దేశానికి స్వాతం­­త్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా ఇప్ప­టి­కీ అంటరానితనం ఆలోచనలు ఉండటం దుర­దృష్టకరమని సుధాకర్‌రెడ్డి తెలి­పారు.

సీఆర్‌డీఏ తరఫు న్యాయవాది కాసా జగన్‌మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సీఆర్‌డీఏ చట్టంలోని సెక్షన్‌–57 ప్రకారం పూలింగ్‌ ద్వారా సమీకరించిన భూమిపై సర్వహక్కులు సీఆర్‌డీఏకే ఉంటాయన్నారు. ఆ భూ­మి సీఆర్‌డీఏ ఆస్తి అవుతుందే తప్ప, రైతు­లది కాదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకో­ర్టు, ఇప్పటికే ఇదే అంశంపై దాఖలైన వ్యాజ్యాలపై సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది చెప్పడంతో ఈ వ్యా­­జ్యా­న్ని సైతం త్రిసభ్య ధర్మాసనానికి నివేదిస్తున్నట్లు తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి ఉత్తర్వుల నిమిత్తం ఈ వ్యాజ్యాన్ని ఆయన ముం­దుంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బొప్పూడి కృష్ణ­మోహన్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. 

ఇళ్లు కావాలని ఎవరూ అడగలేదు.. 
రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు వీలుగా ఆర్‌ 5 జోన్‌ను ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభు­త్వం ఇటీవల జారీచేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ గుంటూరు జిల్లా, కృష్ణాయపాళెం గ్రామానికి చెందిన రైతు అవల నందకిషోర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

దీనిపై మంగళవారం జస్టిస్‌ కృష్ణమోహన్‌ విచారణ జరిపారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌ వాదనలు వినిపిస్తూ, రాజధాని ప్రాంతంలో తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రజ­­లెవ్వరూ కోరలేదన్నారు. గ్రామసభల్లో రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోలేదన్నారు.

పేదల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది 
ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. చట్ట ప్రకా­రం చేయాల్సిన పనిని గత ప్రభు­త్వం విస్మరించిందని, ఆ తప్పు­ను సరిదిద్ది మాస్టర్‌ ప్లాన్‌కు ఓ విలువను తీసుకొచ్చామని, దాన్ని కూడా పిటిషనర్‌ తప్పుపడుతున్నారని తెలిపా­రు. పేదల సంక్షేమానికి తమ ప్రభు­త్వం కట్టుబడి ఉందని, అందులో భాగం­గానే రాజధాని ప్రాంతంలో 900 ఎకరాలను పేద­ల కోసం కేటాయించామని చెప్పారు. ప్రజలు తమకు ఫలానాది కావాలని అడిగేంత వరకు ప్రభుత్వాలు ఎదురుచూడవని.. వారి అవసరాలను గుర్తించడమే ప్రభుత్వ విధి అన్నారు. 

ఇదే అంశంపై త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోంది.. 
వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని, తరువాత పూర్తిస్తాయిలో విచారణ జరుపుతామన్నారు. ఈ సమయంలో ఇంద్రనీల్‌.. ఇదే అంశంపై దాఖలైన వ్యాజ్యాలపై సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోందని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు.

తమకు ఏ ధర్మాసనమైనా ఒక్కటేనని, తాము చట్ట ప్రకారమే ఆర్‌ 5 జోన్‌ను ఏర్పాటుచేశామని సుధాకర్‌రెడ్డి చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ వ్యాజ్యాన్ని త్రిసభ్య ధర్మాసనానికి నివేదించారు. దీనిపై తగిన ఉత్తర్వులు జారీచేసేందుకు ఈ వ్యాజ్యాన్ని సీజే ముందుంచాలని రిజిస్ట్రీని న్యాయమూర్తి ఆదేశించారు.  

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top