రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ.5.64 కోట్లు ఆదా

Above 5 crore savings through reverse tendering - Sakshi

సాక్షి, అమరావతి: సోమశిల–కండలేరు వరద కాలువ, సోమశిల నార్త్‌ ఫీడర్‌ చానల్‌ ప్రవాహ సామర్థ్యాన్ని పెంచే పనులకు నిర్వహించిన రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఖజానాకు రూ.5.64 కోట్లు ఆదా అయ్యాయి. ఆర్థిక బిడ్‌లో తక్కువ ధరకు కోట్‌ చేసి ఎల్‌–1గా నిలిచిన కాంట్రాక్టర్‌ పేర్కొన్న మొత్తంతో పోల్చితే.. ఖజానాకు రూ.26.5 కోట్లు ఆదా అయ్యాయి. పెన్నా నది నుంచి వచ్చే వరద జలాలను ఒడిసిపట్టి నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో కొత్తగా 41,810 ఎకరాలకు నీళ్లందించడం, 4,66,521 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం ద్వారా మొత్తం 5,08,331 ఎకరాలను సస్యశ్యామలం చేయడం, 10 లక్షల మంది దాహార్తి తీర్చడమే లక్ష్యంగా సోమశిల–కండలేరు వరద కాలువ, సోమశిల నార్త్‌ ఫీడర్‌ చానల్‌ ప్రవాహ సామర్థ్యాన్ని పెంచే పనులు చేపట్టడానికి జ్యుడిషియల్‌ ప్రివ్యూ ఆమోదించిన షెడ్యూళ్లతోనే జల వనరుల శాఖ అధికారులు ఈ నెల 1న టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు.

సోమశిల–కండలేరు వరద కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 12 వేల క్యూసెక్కుల నుంచి 24 వేల క్యూసెక్కులకు, సోమశిల నార్త్‌ ఫీడర్‌ చానల్‌ ప్రవాహ సామర్థ్యాన్ని 772 నుంచి 1,540 క్యూసెక్కులకు పెంచేలా పనులు చేపట్టేందుకు రూ.1,304.11 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. ఆ టెండర్లను ఈ నెల 20న తెలుగు గంగ సీఈ హరినారాయణరెడ్డి తెరిచారు. ఈ పనులకు వీపీఆర్‌ మైనింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఎంఆర్‌కేఆర్‌ కనస్ట్రక్షన్స్, రాఘవ కనస్ట్రక్షన్స్‌ సంస్థలు బిడ్‌లు దాఖలు చేశాయి. సాంకేతిక బిడ్‌ మదింపులో ఎంఆర్‌కేఆర్‌ సంస్థ అర్హత సాధించలేదు. దాంతో ఆ సంస్థ దాఖలు చేసిన షెడ్యూల్‌ను తోసిపుచ్చారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఆర్థిక బిడ్‌ను తెరిచారు. రూ.1,324.97 కోట్లకు షెడ్యూల్‌ కోట్‌ చేసిన సంస్థ ఎల్‌–1గా నిలిచింది.

ఆ మొత్తాన్నే కాంట్రాక్ట్‌ విలువగా పరిగణించి బుధవారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రివర్స్‌ టెండరింగ్‌ (ఈ–ఆక్షన్‌) నిర్వహించారు. గడువు ముగిసే సమయానికి వీపీఆర్‌ మైనింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ రూ.1,298.47 కోట్లకు కోట్‌ చేసి ఎల్‌–1గా నిలిచింది. దాంతో ఆ సంస్థకే పనులు అప్పగించాలని ఇంజనీర్‌–ఇన్‌–చీఫ్‌ సి.నారాయణరెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ (ఎస్‌ఎల్‌టీసీ)కి తెలుగు గంగ సీఈ ప్రతిపాదనలు పంపారు. ఈ టెండర్‌ను ఎస్‌ఎల్‌టీసీ లాంఛనంగా ఆమోదించనుంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. ఈ టెండర్‌లో అంతర్గత అంచనా విలువతో పోల్చితే ఖజానాకు రూ.5.64 కోట్లు ఆదా అయ్యాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top