కృష్ణా నదిపై వీటిని అడ్డుకోకపోతే రాయలసీమకు తీవ్రనష్టం
కేంద్రానికి లేఖలు రాయడంతోపాటు సుప్రీంకోర్టులో కేసు వేయాలి
వైఎస్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులపై పెద్ద కదలిక
విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు
కడప సెవెన్‌రోడ్స్: కృష్ణానదిపై కర్ణాటక, తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం చోద్యం చూడకుండా అడ్డుకోవాలని, లేకపోతే ముఖ్యంగా రాయలసీమ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆలోచనాపరుల వేదిక నాయకుడు, విశ్రాంత ఐఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు చెప్పారు. ఆలోచనాపరుల వేదిక ఆధ్వర్యంలో ఆదివారం కడపలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
కర్ణాటక అల్మట్టి డ్యాం ఎత్తు పెంచుతున్నా, తెలంగాణ ప్రభుత్వం జీవో 34 జారీచేసి అక్రమంగా 200 టీఎంసీల నీటిని తరలించుకుపోవడానికి డీపీఆర్ తయారు చేస్తున్నా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందని ధ్వజమెత్తారు.› సీడబ్ల్యూసీ, కేంద్ర జలశక్తి శాఖకు కనీసం లేఖలు రాయని ముఖ్యమంత్రి చంద్రబాబు.. ‘మీ ప్రాజెక్టులు మీరు కట్టుకోండి, మా ప్రాజెక్టులు మేము కట్టుకుంటాం..’ అంటూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్రానికి లేఖలు రాయడంతోపాటు తెలంగాణ జారీచేసిన జీవో నంబరు 34పై సుప్రీంకోర్టులో కేసు వేయాలని డిమాండ్ చేశారు.
పోలవరం–బనకచర్ల పథకం మరో కాలేశ్వరం ప్రాజెక్టు వంటిదని, ఇది కాంట్రాక్టర్లకు సిరులు కురిపించేందుకేనని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులకు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే పెద్ద కదలిక వచ్చిందని కొనియాడారు. ఏపీ రైతు సేవాసమితి అధ్యక్షుడు అక్కినేని భవానిప్రసాద్, సెంటర్ ఫర్ లిబర్టీ అధ్యక్షుడు నల్లమోతు చక్రవర్తి, జలవనరులు, సాగునీటి ప్రాజెక్టుల విశ్లేషకుడు టి.లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ నాయకుడు తులసిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర సాగునీటి ప్రయోజనాలకు విఘాతం కలుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో సైతం చర్చించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.


