● ఏడాది గడవకనే తేలిన కంకర
● నాసిరకం పనులతో కాంట్రాక్టర్ల జేబుల్లోకి రూ.కోట్లు
ఆత్మకూరు: ఏడాది గడవకనే హంద్రీనీవా కాలువ లైనింగ్ పనుల బాగోతం బయట పడింది. సదరు కాంట్రాక్టర్లు పనులను నాసిరకంగా చేయడంతో కాలువలో ఎక్కడికక్కడ కంకర తేలింది. కరువు జిల్లా అయిన అనంతపురం రైతులకు వరంగా దివంగత నేత డాక్టర్ వైఎస్సార్ హంద్రీ నీవా కాలువను 40 టీఎంసీల తాగు, సాగు నీరు అందించే ప్రాజెక్టుగా తీసుకొచ్చారు. వైఎస్సార్ హయాంలోనే చాలా వరకు పనులు పూర్తయ్యాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కుప్పంకు నీరు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో హంద్రీ నీవా కాలువకు సంబంధించిన లైనింగ్ పనులు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. జీడిపల్లి నుంచి కుప్పంకు దాదాపు రూ.3,850 కోట్లతో హంద్రీ నీవా కాంక్రీట్ లైనింగ్ పనులను ప్రారంభించారు. గత ఏడాది హంద్రీ నీవా కాలువకు వచ్చే నీటిని ఆపించి పనులు చేశారు.
కంకర తేలిన లైనింగ్...
ప్రస్తుతం హంద్రీ– నీవా కాలువకు సంబంధించి అధికారులు నీటిని ఆపేశారు. అయితే కాంట్రాక్టర్లు వేగంగా, నాసిరకంగా పనులు చేపట్టడంతో ఎక్కడ చూసినా లైనింగ్ దెబ్బతిని కంకర తేలి అధ్వానంగా కనిపిస్తోంది. కొన్ని చోట్ల పూర్తిగా సిమెంట్, కంకర తేలిపోయి మట్టి దిమ్మెలు కనిపిస్తున్నాయి. కేవలం అధికార పార్టీ కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి మాత్రమే చంద్రబాబు హంద్రీ నీవా కాలువకు కాంక్రీట్ లైనింగ్ పనులు చేపట్టారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సొమ్ము దోచి కాంట్రాక్టర్లకు పెడుతున్నారని మండిపడుతున్నారు.
కాంట్రాక్టర్‌దే బాధ్యత
పనులు చేసిన తర్వాతి నుంచి రెండేళ్ల వరకూ ఏం జరిగినా కాంట్రాక్టర్లదే బాధ్యత. హంద్రీనీవా కాలువకు లైనింగ్ పోయిన చోట మళ్లీ ఫినిషింగ్ చేయిస్తాం. కొన్నిచోట్ల లైనింగ్ వేయలేదు. వేయిస్తాం.
– ఆనంద్, జేఈ, ఇరిగేషన్


