ఉరవకొండ రూరల్: ప్రసిద్ధి చెందిన పెన్నహోబిలం లక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ధ్వజ అవరోహణ కార్యక్రమం నిర్వహించారు. వేద పండితులు ముక్కోటి దేవతలకు వేదమంత్రాలతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనంతపురం పరిధిలోని రుద్రంపేటకు చెందిన యోగానందరెడ్డి ఉభయదారుగా వ్యవహరించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత నృసింహస్వామి శయనోత్సవాన్ని అర్చకులు నిర్వహించారు. ఆమిద్యాల గ్రామానికి చెందిన ఎం.సుగుణవతి, ఓబుళేసు ఉభయదారులుగా వ్యవహరించారు.
కాన్ఫరెన్స్‌లో
పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ
అనంతపురం అర్బన్: ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ రెండో రోజైన శుక్రవారం కూడా కలెక్టర్ ఆనంద్, ఎస్పీ పి.జగదీష్ పాల్గొన్నారు. జిల్లాకు సంబంధించి పలు అంశాలపైన నివేదికలను వారు సీఎంకు సమర్పించారు.
‘ఇన్‌స్టా’లో ప్రేమ..
పెళ్లికి నిరాకరణ
అనంతపురం సెంట్రల్: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడిన జంట మధ్య ప్రేమ చిగురించింది. ఒకట్రెండు కాదు మూడేళ్లుగా ప్రేమాయణం సాగించిన యువకుడు... పెళ్లి పేరు ఎత్తగానే ‘నో’ అనేశాడు. దీంతో బెంబేలెత్తిన యువతి పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే.. అనంతపురానికి చెందిన ఓ యువతికి తెలంగాణలోని కరీంనగర్ నివాసి, డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న పర్వేజ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యాడు. తరచూ చాటింగ్ చేసుకునేవారు. ఈ క్రమంలో నువ్వంటే నాకిష్టమంటూ ఒకరినొకరు చెప్పుకున్నారు. ఈ క్రమంలోనే పలు దఫాలు ప్రత్యక్షంగా కలుసుకుని మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకుందామంటూ కొన్ని రోజులుగా యువతి అభ్యర్థిస్తూ వచ్చింది. ఈ అభ్యర్థనను సదరు యువకుడు తిరస్కరిస్తూ రావడంతో చివరకు అనంతపురం వన్‌టౌన్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలో దిగిన పోలీసులు కరీంనగర్ నుంచి పర్వేజ్‌ను రప్పించుకుని మాట్లాడారు. కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా ససేమిరా అనడంతో చివరకు కేసు నమోదు చేసి, శుక్రవారం రిమాండ్‌కు తరలించారు.


