దడ పుట్టిస్తున్న జల గండం | - | Sakshi
Sakshi News home page

దడ పుట్టిస్తున్న జల గండం

May 8 2026 11:02 AM | Updated on May 8 2026 11:02 AM

అనంతపురం అగ్రికల్చర్‌: జిల్లాలో భూగర్భ జలాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. చాలా మండలాల్లో నీటిమట్టం తగ్గిపోతున్నట్లు వెల్లడి కావడం జిల్లావాసులను భయాందోళనకు గురి చేస్తోంది. ఈ సారి ‘సూపర్‌ ఎల్‌–నినో’ సంభవించనుందంటూ అధికారులు హెచ్చరిస్తుండటం ప్రజలను మరింతగా దడ పుట్టిస్తోంది.

2019 తర్వాత ఇప్పుడే..

గతేడాది జూన్‌లో మొదలై ఈ నెలాఖరుతో ముగిసే వర్షపాత సంవత్సరంలో నాలుగైదు మండలాలు మినహా ఎక్కడా భారీ వర్షాలు నమోదు కాలేదు. ఏడాది పొడవునా 478 మి.మీ మేర సాధారణ వర్షపాతం నమోదైంది. 44 వర్షపు రోజులు (రెయినీడేస్‌) నమోదయ్యాయి. అది కూడా ‘అకాలం’లోనే ఎక్కువ వర్షపాతం నమోదు కావడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు అంచనా వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 91 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫిజోమీటర్ల నుంచి భూగర్భ జలశాఖ తాజాగా సేకరించిన లెక్కల ప్రకారం జిల్లా సగటు నీటి మట్టం 13.41 మీటర్లుగా నమోదైంది. గత నెల 12.14 మీటర్లుగా నమోదు కాగా గతేడాది ఇదే సమయంలో 11.85 మీటర్లుగా ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తమ్మీద చూస్తే 2019 తర్వాత ఇప్పుడు నమోదైన నీటిమట్టమే గరిష్టం కావడం గమనార్హం.

20 మండలాల్లో తగ్గుదల..

వాగులు, వంకలు పొంగిపొర్లేలా వర్షాలు కురవకపోవడంతో ఈ ఏడాది 20 మండలాల పరిధిలో భూగర్భజలాలు తగ్గుతూ వస్తున్నాయి. అందు లోనూ నీటి వినియోగం అధికంగా ఉండటం వల్ల కుందుర్పి, కళ్యాణదుర్గం, యాడికి, శెట్టూరు, పుట్లూరు మండలాలను డేంజర్‌ జోన్‌లోకి చేర్చారు. శెట్టూరు మండలం చెర్లోపల్లిలో ఉన్న ఫిజోమీటర్‌ లో నీటిమట్టం ఏకంగా 59.65 మీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. అలాగే యాడికి మండలం నగరూరులో 53..75 మీటర్లు, పుట్లూరులో 37.75 మీటర్లలో నీటిచెమ్మ కనిపిస్తుండటం విశేషం. ఈ ఐదు మండలాలను ఇప్పటికే డేంజర్‌ జోన్‌లో ఉంచగా, మరో 20 మండలాలు నీటి ఒత్తిడికి గురవుతున్నట్లు గుర్తించారు. అందులో అనంతపురం, గుత్తి, శింగనమల, బొమ్మనహాళ్‌, యల్లనూరు, కూడేరు, బ్రహ్మసముద్రం, గుమ్మఘట్ట, బెళుగుప్ప, కంబదూరు, రాయదుర్గం, తాడిపత్రి, పామిడి, కణేకల్లు, డి.హీరేహాళ్‌ మండలాలు ఉన్నాయి. మిగతా 12 మండలాలు సేఫ్‌జోన్‌లో ఉన్నట్లు వెల్లడైంది.

వర్షపు నీరు వృథా..

ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదైంది. అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసినా ఎక్కడిక్కడ భూగర్భంలో ఇంకిపోయింది చాలా తక్కువే. ఈ ఏడాది 488 మి.మీ వర్షపాతం నమోదు కాగా ప్రవాహం రూపంలో 175.51 టీఎంసీలుగా గుర్తించారు. అందులో 21.06 టీఎంసీలు మాత్రమే భూగర్భజలాలుగా మారినట్లు చెబుతున్నారు. ఇలా వర్షపు నీరు చాలా వరకు వృథా అయినట్లు గుర్తించారు. దీంతో పాతాళగంగ పతనమవుతున్నట్లు అంచనా వేస్తున్నారు. జూన్‌లో వచ్చే ‘నైరుతి’ రుతుపవనాలపై సూపర్‌ ఎల్‌–నినో ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. వర్షాలు తక్కువగా నమోదు కావడం ఒకెత్తయితే.. అవి కూడా గతి తప్పే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇదే నిజమైతే భవిష్యత్తులో భూగర్భజలాలు మరింత క్షీణించే ప్రమాదం ఉంది. ఇప్పటికే చీనీ తోటలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. భవిష్యత్తులో ఇతర ఉద్యాన పంటలకు కూడా ముప్పు తప్పకపోవచ్చని హెచ్చరిస్తున్నారు. హంద్రీ–నీవాకు లైనింగ్‌ వేయడం, కోటా మేరకు చెరువులు నింపకపోవడం కూడా భూగర్భ జలాల తగ్గుదలకు కారణమని చెబుతున్నారు.

జిల్లాలో తాజా సగటు నీటి మట్టం 13.41 మీటర్లుగా నమోదు

20 మండలాల్లో భూగర్భజలాలు తగ్గుతున్నట్లు గుర్తింపు

డేంజర్‌ జోన్‌లో ఐదు మండలాలు

సూపర్‌ ఎల్‌నినో హెచ్చరికతో

సర్వత్రా భయాందోళనలు

Advertisement
 
Advertisement
Advertisement