సీఎం కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

సీఎం కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌

May 8 2026 11:02 AM | Updated on May 8 2026 11:02 AM

అనంతపురం అర్బన్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో గురువారం నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ ఓ.ఆనంద్‌ పాల్గొన్నారు. శుక్రవారం కూడా కాన్ఫరెన్స్‌ జరగనుంది. జిల్లా అభివృద్ధికి సంబంధించిన వివరాలను కలెక్టర్‌ ఈ సమావేశాల్లో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నారు.

12న డెడికేటెడ్‌ కమిషన్‌ రాక

అనంతపురం ఎడ్యుకేషన్‌: బీసీల స్థితిగతులు, రిజర్వేషన్ల అమలును సమీక్షించడానికి విశ్రాంత ఐఏఎస్‌ రాజీవ్‌ రంజన్‌ మిశ్రా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డెడికేటెడ్‌ కమిషన్‌ ఈనెల 12న జిల్లాలో పర్యటించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ డీడీ కుస్బూ కొఠారి తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. 12న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రెవెన్యూ భవనంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తారన్నారు. కుల సంఘాలు, పౌర సమాజ సంస్థలు, ప్రజాప్రతినిధుల నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. వెనుకబడిన తరగతులకు ఇవ్వాల్సిన రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించేందుకు సమగ్ర అనుభవాధారిత అంచనా చేపడతారన్నారు. అవకాశాన్ని వెనుకబడిన తరగతుల ప్రతినిధులు, కులస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

17 నుంచి ఖాద్రీశుని కల్యాణోత్సవాలు

కదిరి టౌన్‌: ఖాద్రీశుని ఆర్జిత కల్యాణోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని రంగమండపంలో ఈనెల 17వ తేదీ నుంచి 31వ తేదీ వరకు శ్రీదేవి, భూదేవి సమేత వసంతవల్లభుని కల్యా ణోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కల్యాణోత్సవ సేవ టిక్కెట్లు రోజూ 5 మాత్రమే జారీ చేస్తామన్నారు. ఒక్కో టిక్కెట్‌ ధర రూ.6,500గా నిర్ణయించామని, ఒక టిక్కెట్‌పై ఐదుగురికి మాత్రమే ప్రవేశం ఉంటుందన్నారు. ఈనెల 17, 18, 19, 20, 21, 22, 24, 25, 26, 27, 28, 31వ తేదీల్లో శ్రీవారి కల్యాణోత్సవాలు నిర్వహిస్తామని, ఆసక్తి ఉన్న వారు టిక్కెట్లు బుక్‌ చేసుకోవాలని సూచించారు.

ప్రైవేట్‌లో ప్రవేశాలకు

లాటరీ ఫలితాల విడుదల

అనంతపురం ఎడ్యుకేషన్‌: బాలల ఉచిత, నిర్బంధ విద్యాహక్కు (ఆర్టీఈ) చట్టం 12(1)సీ మేరకు 2026–27 విద్యా సంవత్సరంలో ప్రైవేట్‌ పాఠశాలల్లో నిరుపేద విద్యార్థులకు కేటాయించే 25 శాతం ఉచిత ప్రవేశాలకు సంబంధించి రెండోవిడత లాటరీ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. జిల్లాలో 5 కిలోమీటర్ల పరిధిలోని మొత్తం 377 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించినట్లు డీఈఓ ఎం. ప్రసాద్‌బాబు, సమగ్రశిక్ష ఏపీసీ శైలజ తెలిపారు. ఎంపికై న విద్యార్థుల వివరాలను తల్లిదండ్రుల మొబైల్‌ నంబర్లకు ఎస్‌ఎంఎస్‌లు పంపామన్నారు. అలాగే అధికారిక వెబ్‌సైట్‌ cse.ap.gov.in లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. సీట్లు పొందిన విద్యార్థుల తల్లిదండ్రుల ఆధార్‌కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, విద్యార్థి జనన ధ్రువీకరణ పత్రం, రేషన్‌కార్డుతో ఈనెల 16లోపు ఆయా పాఠశాలలకు వెళ్లి అడ్మిషన్‌ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు టోల్‌ఫ్రీ నంబరు 18004258599ను సంప్రదించవచ్చన్నారు. కాగా సంబంధిత పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి వెంటనే అడ్మిషన్లు కల్పించాలని ఆదేశించారు. సరైన కారణం లేకుండా ప్రవేశాలను నిరాకరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. పాఠశాలల యాజమాన్యాలకు ఏవైనా సందేహాలుంటే ఎంఈఓలను సంప్రదించాలని సూచించారు.

మార్కెట్‌కు 10 టన్నుల టమాట

అనంతపురం అగ్రికల్చర్‌: స్థానిక కక్కలపల్లి మండీకి గురువారం 10 టన్నుల టమాట అమ్మకానికి వచ్చింది. మార్కెట్‌ నిర్వాహకులు వాటిని వేలం వేశారు. కిలో టమాట గరిష్ట ధర రూ.22 పలికింది. కనిష్టం రూ.8, సరాసరిన రూ.16 ప్రకారం క్రయ విక్రయాలు జరిగాయి.

Advertisement
 
Advertisement
Advertisement