●గోవిందా.. గోవింద | - | Sakshi
Sakshi News home page

●గోవిందా.. గోవింద

May 8 2026 11:02 AM | Updated on May 8 2026 11:02 AM

రాయదుర్గంలో ఘనంగా శ్రీవారి బ్రహ్మరథోత్సవం

రాయదుర్గం: పట్టణంలో ప్రసన్న వేంకటేశ్వరుడి బ్రహ్మ రథోత్సవం గురువారం ఘనంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి ఉదయం 11 గంటలకు మడుగుతేరు నిర్వహించారు. విశేష పూజలు చేపట్టిన అనంతరం సాయంత్రం 5 గంటలకు బ్రహ్మరథంపై కొలువుదీర్చారు. స్వర్ణాభరణాలు ధరించి శ్రీదేవి, భూదేవి సమేతంగా ఆశీనులైన స్వామివారు అభయ ప్రదానం చేయగా.. వేలాది మంది భక్తజనం మధ్య దివ్యచక్రాలు ముందుకు కదిలాయి. గోవిందా.. గోవిందా, ఆపద మొక్కులవాడా అనాథ రక్షకా అంటూ భక్తులు రథాన్ని లాగి పరవశించిపోయారు. రథంపైకి అరటిపండ్లు విసిరి మొక్కులు చెల్లించుకున్నారు. రథోత్సవం సందర్భంగా రాయదుర్గం జన సంద్రంలా మారింది. రథం ముందు మహిళల నృత్యాలు, బొమ్మల ప్రదర్శన, యువకుల నాట్యం, కోలాటం, చెక్కభజనలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement