నీళ్ల మాటున నిధుల స్వాహా | - | Sakshi
Sakshi News home page

నీళ్ల మాటున నిధుల స్వాహా

May 8 2026 11:02 AM | Updated on May 8 2026 11:02 AM

కళ్యాణదుర్గం: చంద్రబాబు ప్రభుత్వంలో టీడీపీ నేతల కాసుల కక్కుర్తి తారస్థాయికి చేరింది. ధనార్జనే ధ్యేయంగా ముందుకు వెళ్తున్న ‘పచ్చ’ నాయకులు చివరకు పేద ప్రజలకు అందించే నీళ్లనూ ‘క్యాష్‌’ చేసుకోవడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో వెలుగు చూసిన ఈ అవినీతి బాగోతం అంతటా చర్చనీయాంశంగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. కళ్యాణదుర్గంలోని 24 వార్డుల్లో నీటి ఎద్దడి నెలకొనడంతో ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరాకు శ్రీకారం చుట్టారు. ఈ విషయంపై టీడీపీకి చెందిన ఓ మాజీ మున్సిపల్‌ చైర్మన్‌, మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్ల కన్ను పడింది. ఉన్నతాధికారితో కుమ్మకై ్క సరఫరా చేసిన నీటి కంటే ఎక్కువగా బోగస్‌ రికార్డులు సృష్టించారు. 10 ట్యాంకర్ల నీటిని సరఫరా చేస్తే వాటికి అదనంగా 80 ట్యాంకర్ల నీటిని పంపిణీ చేసినట్లు తప్పుడు లెక్కలు చూపారు. నీటి సరఫరానే కాకుండా పైపులైన్ల ఏర్పాటు, కొత్త మోటర్ల బిగింపు, మరమ్మతులు ఇలా తాగునీటి పథకంలో తమకు అనుకూలంగా ఉన్న వారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. గుట్టుచప్పుడు కాకుండా ఇటీవల కళ్యాణదుర్గంలోని ఓ ప్రైవేట్‌ బ్యాంకులో రూ.80 లక్షల నగదు డ్రా చేసి జేబుల్లో వేసుకున్నారు.

మందలించిన ఎమ్మెల్యే!

నిధుల స్వాహా అంశం ‘దుర్గం’లో చర్చనీయాంశం కావడం.. ఆ నోటా ఈ నోటా పడి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు చెవిన పడడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మున్సిపల్‌ కమిషనర్‌, టీడీపీ నేతలను తన వద్దకు పిలిపించుకుని మందలించినట్లు సమాచారం. పేదలకు తాగునీటిని అందించే విషయంలో కూడా తలదూర్చి నిధులను పక్కదారి పట్టించడం ఏంటని మండిపడినట్లు తెలిసింది. కాగా, ట్యాంకర్ల ద్వారా నీటి పంపిణీ, నిధుల అంశంపై ఎవరైనా ప్రశ్నిస్తే ఏమీ తెలియనట్లుగా ఉండాలని, మీడియాకు వివరాలు చెప్పకూడదని అధికారులు మున్సిపల్‌ కార్యాలయ సిబ్బందిని హెచ్చరించినట్లు తెలిసింది. ఏది ఏమైనా ‘దుర్గం’ మున్సిపల్‌ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ఉన్నతాధికారులైనా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

అవినీతి చేశానని అనడం సరికాదు

నేను అవినీతి చేశానని అనడం సరికాదు. నాపై లేని పోని అభాండాలు వేస్తున్నారు. మేము ఎప్పుడూ ప్రైవేట్‌ బ్యాంకులో నగదు డ్రా చేయలేదు. మున్సిపాలిటీ అమౌంట్‌ ప్రైవేట్‌ బ్యాంకులలో జమ చేసి తీసుకునే అధికారం కమిషనర్‌కు ఉండదు. ఏదైనా తప్పు జరిగి ఉంటే ఉన్నతాధికారులు విచారణ చేస్తారు.

– వంశీకృష్ణ భార్గవ్‌, మున్సిపల్‌ కమిషనర్‌, కళ్యాణదుర్గం

తారస్థాయికి ‘పచ్చ’ నేతల కాసుల కక్కుర్తి

తప్పుడు లెక్కలతో రూ.80 లక్షలకు పైగా మింగేసిన వైనం

‘దుర్గం’ మున్సిపల్‌ ఉన్నతాధికారి హస్తంపై గుప్పుమన్న ఆరోపణలు

Advertisement
 
Advertisement
Advertisement