● ప్రజల దరి చేరని ఒక నెల, ఒక గ్రామం, నాలుగు సందర్శనలు..
● స్పష్టంగా కనిపించిన సమాచార లోపం
అనంతపురం అర్బన్: భూ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ‘ఒక నెల, ఒక గ్రామం, నాలుగు సందర్శనలు’ కార్యక్రమం మొదటి వారమే అట్టర్‌ఫ్లాప్ అయ్యిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గురువారం జిల్లాలోని 32 గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమంలో అందిన ఫిర్యాదుల సంఖ్య కేవలం 238 ఉండడమే ఇందుకు నిదర్శనమంటున్నారు. 10 గ్రామాల్లో మాత్రమే తొమ్మిది నుంచి 20 వరకూ ఫిర్యాదులు అందాయి. మిగిలిన 12 గ్రామాల్లో నాలుగు నుంచి ఆరు ఫిర్యాదులు ఉన్నాయి. ఇక ఓబుళాపురం, కరకముక్కల, అబ్బేదొడ్డి, ఎస్.మల్లాపురం గ్రామాల్లో కేవలం ఒకటి చొప్పున, రాజీవ్‌కాలనీ, అక్కజంపల్లి గ్రామాల్లో రెండు చొప్పున, ఎంఎంహళ్లి, దుర్గం, 85–నిట్టూరు, రాగులపాడు గ్రామాల్లో మూడు చొప్పున ఫిర్యాదులు అందడం గమనార్హం.
సమాచార లోపంతోనే..
ముందస్తు సమాచారం లేని కారణంగానే ప్రజలు సద్వినియోగం చేసుకోలేకపోయారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కనీసం రెండు,మూడు రోజులు ముందుగానే ప్రజలకు సమాచారం ఇవ్వాలి. పలానా రోజున గ్రామంలో జరుగుతుందనే విషయాన్ని ఎంపిక చేసిన గ్రామంలో టముకూ లేదా రెవెన్యూ సిబ్బంది ద్వారా తెలియజేయాల్సి ఉంటుంది. అయితే ‘ఒక నెల, ఒక గ్రామం, నాలుగు సందర్శనల’ కార్యక్రమంలో ఇలాంటివేవీ కనిపించలేదు.


