ఆ అధికారి వికృతంగా ప్రవర్తిస్తున్నాడు. కిందిస్థాయి అమాయక మహిళా ఉద్యోగులను వేధిస్తున్నాడు. పలువురు బాధితుల కుటుంబ సభ్యులు బడిత పూజ చేసినా.. ఆ అధికారిలో ఏమాత్రమూ మార్పు రావడం లేదు. | - | Sakshi
Sakshi News home page

ఆ అధికారి వికృతంగా ప్రవర్తిస్తున్నాడు. కిందిస్థాయి అమాయక మహిళా ఉద్యోగులను వేధిస్తున్నాడు. పలువురు బాధితుల కుటుంబ సభ్యులు బడిత పూజ చేసినా.. ఆ అధికారిలో ఏమాత్రమూ మార్పు రావడం లేదు.

Apr 15 2026 7:38 AM | Updated on Apr 15 2026 7:38 AM

తాడిపత్రి టౌన్‌: మున్సిపాలిటీలోని ఓ అధికారి వేధింపులకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. మహిళ అందంగా కనిపిస్తే చాలు తన కోరిక తీర్చాలంటూ వేధిస్తున్నాడు. ఇప్పటికే పలువురు మహిళల పట్ల వికృతంగా ప్రవర్తించారు. తాజాగా ఓ అమాయకురాలిపై కన్నేయగా...ఆమె భర్త సదరు అధికారికి దేహశుద్ధి చేశాడు. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఓ సచివాలయంలో పనిచేసే యువతి మున్సిపల్‌ కార్యాలయానికి అటాచ్డ్‌ కింద డ్యూటీ వేయించుకున్నారు. అక్కడ ఓ కీలక అధికారి ఆమె అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకుని తన మనసులోని కోరిక బయటపెట్టాడు. దీంతో ఆమె దిగ్భ్రాంతికి గురై విషయాన్ని భర్తకు చెప్పి విలపించింది. ఆగ్రహావేశాలకు లోనైన భర్త ఆ అధికారి ఇంటికెళ్లి దేహశుద్ధి చేశాడు. వేధింపుల ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించగా అధికార పార్టీ నేత ఒకరు జోక్యం చేసుకుని బయటకు రాకుండా ‘పంచాయితీ’ చేశాడు.

● మున్సిపల్‌ కార్యాలయంలో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ యువతిని సైతం సదరు కీలకాధికారి ఫోన్‌ ద్వారా లైంగిక వేధింపులకు గురిచేసేవాడు. కొన్ని నెలలుగా జీతం పెండింగ్‌ ఉండటంతో ఆ అధికారికి ఫోన్‌ ద్వారా వివరించడమే ఆమె తప్పయ్యింది. దీన్ని అలుసుగా తీసుకొని వేధింపులకు ప్రయత్నించడంతో తీవ్ర మానసిక వేదనకు గురైన యువతి విషయాన్ని భర్తకు తెలిపింది. ఆయన ఏకంగా కార్యాలయానికి వచ్చి గొడవకు దిగాడు. అప్పుడు కూడా అధికార పార్టీ నాయకుడు కల్పించుకుని ‘సర్దుబాటు’ చేశాడు.

అందంగా కనిపిస్తే వేధింపులే..

మున్సిపల్‌ కార్యాలయంలో ఆ అధికారి అంటే మహిళా ఉద్యోగులు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు హడలెత్తిపోతారు. మహిళా ఉద్యోగులు కాస్త అందంగా కనిపిస్తే చాలు ఆ అధికారి నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కోక తప్పదు. ఒంటరిగా కార్యాలయంలోకి వెళ్లాలంటే హడలెత్తిపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో చాంబర్‌లోకి వెళ్లిన వారికి ఆ అధికారి వక్ర చూపు, రెచ్చగొట్టే మాటలు, జుగుప్సాకర చేష్టలతో తన వాంఛ తీర్చుకునే ప్రయత్నం చేస్తాడు.

● గతంలో ఓసారి పురపాలక సంఘంలో పురుషుల స్థానంలో మహిళా ఉద్యోగులను నియమించుకోవాలని కీలక అధికారి భావించాడు. తన ఆలోచనను అధికార పార్టీ నాయకునికి చెప్పి ఒత్తిడి చేశాడు. అయితే అది కార్యరూపం దాల్చలేదు.

సచివాలయ ఉద్యోగులే టార్గెట్‌

తాడిపత్రి ప్రాంతంలోని సచివాలయాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులను ఆ కీలకాధికారి టార్గెట్‌ చేశారు. సాధారణంగా సాయంత్రం 5 గంటలలోపు సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తుంటారు. అయితే ఈ అధికారి మాత్రం సాయంత్రం 5 తరువాతే సమావేశాలు, సమీక్షలంటూ సచివాలయ ఉద్యోగులను పిలిపించుకుంటాడు. కొన్నిసార్లు రాత్రి 8 గంటలైనా కొనసాగిస్తుంటాడు. ఈ అధికారి వైఖరితో మహిళా ఉద్యోగులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. అంతేకాదు భార్యాభర్తల మధ్య గొడవకు దారి తీసిన సందర్భాలూ అనేకం ఉన్నాయి.

తన ప్రవర్తనతో తరచూ గొడవలు

గతంలో ఆ కీలకాధికారి ప్రభుత్వ క్వార్టర్స్‌లో నివాసం ఉండేవాడు. అప్పట్లో పొదుపు సంఘంలో పనిచేస్తున్న ఓ మహిళను పలు రకాలుగా భయపెట్టి లోబరుచుకున్నాడు. ఈ విషయం తెలిసిన మరో ఉద్యోగి కూడా అమెను బ్లాక్‌మెయిల్‌ చేసి తానూ సన్నిహితంగా మెలిగాడు. ఈ వ్యవహారం అధికారికి తెలిశాక ఉద్యోగితో గొడవకు దిగాడు.

కొన్నిరోజుల తరువాత క్వార్టర్స్‌లో ఇంటి పనిచేస్తున్న యువతితో కీలకాధికారి సన్నిహితంగా మెలిగాడు. విషయం తెలుసుకున్న మహిళ భర్త.. సదరు అధికారిని నిలదీసి.. మర్యాద తీస్తానని బెదిరించాడు. ఇంతలో అధికార పార్టీ నాయకుడు జోక్యం చేసుకొని సద్దుమణిగించాడు. ఈ తతంగం చుట్టుపక్కల వారికి తెలియడంతో క్వార్టర్స్‌ ఖాళీ చేసి.. తన కార్యాలయానికి సమీపంలో అద్దె ఇంటికి మకాం మార్చాడు.

ఇల్లు మారినా ఆ అధికారి బుద్ధి మాత్రం మారలేదు. భార్య లేని సమయంలో ఇంట్లోనే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవాడు. ఇంటి యజమాని గమనించి బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించాడు. దీంతో మరో ఇంటికి మారాడు. అక్కడా పాత పద్ధతే కొనసాగిస్తున్నాడు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఆ అధికారి లైంగిక వేధింపుల నుంచి తమకు విముక్తి కల్పించాలని బాధిత ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు.

మహిళా ఉద్యోగులు అందంగా కనిపిస్తే అంతే..

రెచ్చగొట్టే మాటలు.. జుగుప్సాకర భాషతో వెకిలి చేష్టలు

ఇదీ తాడిపత్రిలో కీలక అధికారి తీరు

దుమారం రేగిన ప్రతిసారీ అధికార పార్టీ నేత ‘దుప్పటి పంచాయితీ’

Advertisement
 
Advertisement
Advertisement