● పప్పుధాన్యాల్లో కంది, పప్పుశనగకే ప్రాధాన్యత
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా వ్యవసాయంలో చిరుధాన్యాలు (మిల్లెట్స్) పంటలపై చిన్నచూపు కొనసాగుతుండగా, పప్పుధాన్యాల (పల్సస్) పంటల సాగు విస్తీర్ణం కూడా తగ్గుతోంది. మిల్లెట్స్‌లో సజ్జ, రాగి, కొర్ర, అండుకొర్ర, ఆరిక, సామ, జొన్న, మొక్కజొన్న తదితర పంటలు ఉండగా అందులో ప్రస్తుతం మొక్కజొన్నకే రైతులు ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే పల్సస్‌లో పెసర, అలసంద, మినుము, కంది, పప్పుశనగ, సోయా, అనుము తదితర పంటలు ఉండగా అందులో కంది, పప్పుశనగ సాగుపై రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా ‘మిల్లెట్స్–పల్స్’లో రెండు మూడింటిపై రైతులు మొగ్గుచూపుతుండగా మిగతావన్నీ నామమాత్రంగా సాగవుతున్నాయి. జిల్లాలో ప్రధానపంటగా 30 ఏళ్ల పాటు లక్షలాది ఎకరాల సాగుతో ఓ వెలుగు వెలిగి ప్రపంచ దృష్టి ఆకర్షించిన వేరుశనగ ఇప్పుడు క్షీణించే దశకు చేరుకుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో సాగవుతున్న వేరుశనగ నేడు నాలుగు లక్షల ఎకరాల కనిష్ట స్థాయికి పతనం కావడం గమనార్హం.
పంటల వైవిధ్యానికి చిరునామా ‘అనంత’
వ్యవసాయ రికార్డులు పరిశీలిస్తే... 1960 నుంచి 1980 వరకు పంటల వైవిధ్యానికి అనంతపురం జిల్లా కేరాఫ్‌గా నిలిచింది. ఖరీఫ్ వచ్చిందంటే చాలు 25 నుంచి 30 రకాల పంటలతో పంటల వైవిధ్యతను చాటుకుంది. 1985 తర్వాత వేరుశనగ సాగు క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2005 నాటికి ఏకపంటగా విస్తరించిన వేరుశనగ దెబ్బకు మిగతా పంటలన్నీ కనుమరుగయ్యే దశకు చేరుకున్నాయి. 2010 తర్వాత వివిధ కారణాలతో వేరుశనగ సాగు తగ్గుదల నమోదవుతోంది. వేరుశనగ తగ్గడంతో మరోసారి పంటల సరళి మారుతోందని భావించినా.. చిరుధాన్యాల్లో మొక్కజొన్న, పప్పుధాన్యాల్లో కందికే ప్రాధాన్యత ఇస్తున్నారు. కనీసం రాగి, జొన్న, సజ్జ, కొర్ర, అలాగే పెసర, అలసంద, మినుము, ఉలవ లాంటి పంటలు పెరిగితే మరోసారి పంటల వైవిధ్యం స్పష్టంగా గోచరిస్తుంది. వీటి పరిస్థితి ఇలా ఉండగా.. వరి సాగు మాత్రం ఆనాటి నుంచి ఈనాటి వరకు స్థిరంగానే ఉండటం గమనార్హం. అప్పట్లో బోరు బావుల కింద ప్రతి రైతూ అంతో ఇంతో సాగు చేస్తుండగా ఇప్పుడు ఆయకట్టు ప్రాంతాలకే వరి పరిమితమైనా సాగు విస్తీర్ణం కాస్త ఇటుగా పయనం సాగిస్తోంది.
అప్పట్లో చిరుధాన్యాల శకం
1960 దశకంలో రాగి, జొన్న, సజ్జ, కొర్ర, అండుకొర్ర, ఆరిక, సామ తదితర మైనర్ అండ్ మేజర్ మిల్లెట్స్ (చిరుధాన్యాలు) ఏకంగా 15 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. అప్పట్లో వేరుశనగ 5 లక్షల ఎకరాలకు మించి సాగు చేయలేదు. వరుస కరువులు, వర్షాభావం, వ్యవసాయంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు, రైతుల ఆలోచన విధానాల మార్పుల కారణంగా పంటల సరళి విభిన్నంగా కొనసాగింది. 2000 సంవత్సరానికి అటు ఇటుగా వేరుశనగ పంట ఏకంగా 20 లక్షల ఎకరాలకు ఎగబాకడం, చిరుధాన్యపు పంటలన్నీ కలిపినా 50 వేల ఎకరాలకు పరిమితం కావడం చూస్తే వేరుశనగ దూకుడు ఏ స్థాయిలో ఉందనేది అర్థమవుతోంది. జిల్లాలో ఎక్కడ చూసినా వేరుశనగ తప్ప మిగతా పంటలు కనిపించని పరిస్థితికి చేరాయి. విస్తీర్ణం తగ్గిపోయిన వేరుశనగ స్థానంలో ఇప్పుడు కంది, మొక్కజొన్న, ఆముదం లాంటి పంటలు ఆక్రమించాయి. చిరుధాన్యపు పంటల విస్తీర్ణం పెంపునకు చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నా ఆచరణలోకి రావడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


