హైవేపై బ్లాక్ స్పాట్లకు చెక్
● ప్రమాదాల నివారణకు తపోవనం, రాప్తాడు వద్ద సిక్స్‌వే వై జంక్షన్ల ఏర్పాటు
● 18 ప్రాంతాల్లో అండర్ పాస్‌లు
అనంతపురం టవర్‌క్లాక్: కర్నూలు నుంచి బాగేపల్లి వరకూ ఎన్‌హెచ్ 44 జాతీయ రహదారిలో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కేంద్ర రహదారులశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మార్గంలో ఉన్న 24 బ్లాక్ స్పాట్లను అధికారికంగా గుర్తించి వాటి పరిష్కరానికి భారీగా నిధులు మంజూరు చేసింది. నాలుగు ఫ్లై ఓవర్లు .. ఆరు వరుసల రహదారులు, 18 అండర్ పాస్, సర్వీస్ రోడ్లు, అండర్ పుట్స్, అండర్ బ్రిడ్జిల నిర్మాణాలు చేపట్టనున్నారు.
ఒక్కో ఫ్లై ఓవర్‌కు రూ.40 కోట్లు
కర్నూలు నుంచి బాగేపల్లి వరకు 24 ప్రమాద ప్రాంతాలు ఉండగా అందులో తపోవనం, రాప్తాడు, సోమందేపల్లి, కోడూరు వద్ద ఆరు లైన్లు రహదారులతో వై జంక్షన్ ప్‌లైఓవర్లు నిర్మించనున్నారు. ఒక్కో ఫ్లై ఓవర్‌కు రూ.40 కోట్లు నిధులు ఖర్చు చేయనున్నారు. వీటికి త్వరలోనే టెండర్లకు పిలవనున్నారు.
18 అండర్ పాస్‌లు
ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి 18 చోట్ల అండర్ పాస్‌లు, సర్వీస్ రోడ్లు, చిన్న అండర్ బ్రిడ్జిల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తానికి 24 బ్లాక్ స్పాట్స్ ఉండగా 22 చోట్ల సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు.
ప్రమాదాలు తగ్గే ప్రదేశాలు
తపోవనం, సాక్షి ఎడిషన్, రాప్తాడు, సోమందేపల్లి మార్గాల వద్ద రోడ్లు ప్రమాదాలు తగ్గనున్నాయి. భారీ వాహనాలు, రహదారి దాటే చిన్న వాహనాలతో తర చూ ప్రమాదాలు జరిగేవి. ఇప్పుడు అండర్ పాస్‌లు, సర్వీస్ రోడ్లు పూర్తయితే ఆయా ప్రాంతాల్లో దాదాపు 40 నుంచి 60 శాతం వరకు ప్రమాదాలు తగ్గుతాయి.


