పగలు రెక్కీ.. రాత్రి దోపిడీ
హిందూపురం: జిల్లాలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను హిందూపురం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.40 లక్షలు విలువ చేసే 309.13 గ్రాముల బంగారు నగలు, 3,010 గ్రాముల వెండి సామగ్రి, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం హిందూపురం అప్‌గ్రేడ్ పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను డీఎస్పీ మహేష్, సీఐ ఆంజనేయులుతో కలసి ఎస్పీ సతీష్‌కుమార్ వెల్లడించారు.
పట్టుబడింది వీరే...
పోలీసులకు పట్టుబడిన వారిలో గుంటూరులోని రామిరెడ్డినగర్‌కు చెందిన బండికాళ్ల రత్నరాజు అలియాస్ తేజా (ప్రస్తుతం పరిగి మండలం గొల్లపల్లిలో ఉంటున్నాడు), హిందూపురం మండలం హనుమేపల్లికి చెందిన ఎస్‌ఎన్ బాబూప్రసాద్ (ప్రస్తుతం చిక్కబళ్లాపురం జిల్లా గౌరీబిదనూరు తాలూకా విదురాశ్వత్థంలో ఉంటున్నాడు), గౌరీబిదనూరు తాలూకా అలకాపురం నివాసి సిద్దిక్ సాహెబ్, హిందూపురం మండలం సంతేబిదనూరు గ్రామానికి చెందిన ఎంజీ గంగరాజు, ఉప్పర సురేష్ ఉన్నారు. వీరిలో ప్రధాన నిందితుడు రత్నరాజుపై 55 కేసులు ఉన్నాయి.
2023 నుంచి వరుస చోరీలు
చోరీ కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో పరిచయం పెంచుకున్న ఐదుగురు.. విడుదలైన తర్వాత ముఠాగా ఏర్పడి పగటి సమయంలో కాలనీల్లో సంచరిస్తూ తాళం వేసిన ఇళ్లను గుర్తించేవారు. చీకటి పడగానే ఆయా ఇళ్లలోకి చొరబడి విలువైన సామగ్రితో పాటు నగదూ అపహరించుకెళ్లేవారు. 2023 నుంచి ఈ నెల వరకూ వీరు హిందూపురం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని పలు పీఎస్‌ల పరిధిలో వరుస దోపిడీలు సాగిస్తూ వచ్చారు. ఆయా ఘటనల్లో బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు... ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశాలతో డీఎస్పీ మహేష్ నేతృత్వంలో బృందాలుగా విడిపోయి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన సాయంతో బుధవారం ఉదయం ఐదుగురిని అరెస్ట్ చేసి, బంగారు నగలు, వెండి సామగ్రితో పాటు మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. నిందితుల అరెస్ట్‌లో చొరవ చూపిన సిబ్బందిని అభినందిస్తూ ఎస్పీ రివార్డులు అందజేశారు.
తాళం పడిన ఇళ్లే టార్గెట్..
అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యుల అరెస్ట్
320 గ్రాముల బంగారు, 3 కిలోల వెండి సామగ్రి స్వాధీనం
పగలు రెక్కీ.. రాత్రి దోపిడీ


