‘నకిలీ’ సూత్రధారులకు బిగుస్తున్న ఉచ్చు
మడకశిర: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారంలో సూత్రధారుల మెడకు ఉచ్చు బిగుస్తోంది. అగళి మండలం కొమరేపల్లి గ్రామ పంచాయతీ లాగిన్ నుంచి ఏకంగా 3,982 నకిలీ బర్త్ సర్టిఫికెట్లు జారీ కాగా, అధికారులు అప్రమత్తమయ్యారు. సమగ్ర విచారణ కోసం ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లా నోడల్ అధికారి కళాధర్ వారం రోజుల పాటు విచారణ చేసి ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక పంపారు. దీంతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగానే నకిలీ బర్త్ సర్టిఫికెట్ల సూత్రధారులెవరో తేల్చి క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించినట్లు సమాచారం.
3,981 బర్త్ సర్టిఫికెట్లు రద్దు
కొమరేపల్లి గ్రామ పంచాయతీ లాగిన్ నుంచి జారీ అయిన బర్త్ సర్టిఫికెట్లపై అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేశారు. ఇందులో ఒకే ఒక బర్త్ సర్టిఫికెట్ మాత్రం అసలుదని గుర్తించారు. మిగిలిన 3,981 బర్త్ సర్టిఫికెట్లన్నీ నకిలీవేనని తేల్చారు. ఇదే విషయాన్ని విచారణ అధికారులు ప్రభుత్వానికి పంపిన నివేదికలో పొందుపర్చారు. దీంతో ప్రభుత్వం నకిలీ బర్త్ సర్టిఫికెట్లన్నింటినీ రద్దు చేయాలని ఆదేశించగా... అధికారులు చర్యలకు ఉపక్రమించారు. బుధవారం నాటికే 3,981 నకిలీ బర్త్ సర్టిఫికెట్లను రద్దు చేసినట్లు తెలుస్తోంది.
సూత్రధారుల అరెస్ట్‌కు రంగం సిద్ధం!
నకిలీ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన సూత్రధారుల అరెస్ట్‌కు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు క్రిమినల్ కేసు నమోదు కాగానే... పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిసింది. అయితే ఈ కేసును స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తారా...? లేక సైబర్ పోలీసులు దర్యాప్తు చేస్తారా..? అనే విషయం త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. ఏదిఏమైనా మరో రెండు, మూడు రోజుల్లో నకిలీ సూత్రధారులు కటకటాల వెనక్కు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది,
నకిలీ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక
క్రిమినల్ కేసు నమోదుకు సిఫార్సు చేసిన ఉన్నతాధికారులు
3,981 బర్త్ సర్టిఫికెట్లు రద్దు..సూత్రధారుల అరెస్ట్‌కు రంగం సిద్ధం


