కిసాన్ రైలు నడపండి
గుంతకల్లుటౌన్: జిల్లాలో అన్నదాతలు పండిస్తున్న ఉద్యాన పంటల ఉత్పత్తుల ఎగుమతి కోసం తాడిపత్రి నుంచి ఢిల్లీ, ముంబైకు కిసాన్ రైలు నడిపేలా చర్యలు తీసుకోవాలని గుంతకల్లు డీఆర్‌ఎం చంద్రశేఖర్ గుప్తాను కలెక్టర్ ఆనంద్ కోరారు. బుధవారం గుంతకల్లులో డీఆర్‌ఎంతో కలెక్టర్ భేటీ అయ్యారు. అరటి, చీనీ, మామిడి, దానిమ్మ, తదితర ఉద్యాన పంటల ఉత్పత్తి ఎగుమతి చేసే రైతులకు రవాణా చార్జీలను కూడా తగ్గించాలని కలెక్టర్ కోరారు.
త్వరితగతిన పూర్తి చేయండి
వజ్రకరూరు: విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. బుధవారం వజ్రకరూరు మండలం రాగులపాడు,కొనకొండ్ల గ్రామాల్లో జరుగుతున్న విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణ ప నులను ఆయన పరిశీలించారు. 20 రోజుల్లోపు పూర్తిచేసి భవనాలను అధికారులకు అప్పగించాలని సూచించారు.
భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించండి
గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయానికి విచ్చేసే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ఆనంద్ ఆలయ అధికారులకు సూచించారు. ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించే క్రమంలో భాగంగా బుధవారం మధ్యాహ్నం విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కలెక్టర్‌కు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేశారు. అనంతరం ఆలయంలో చేపడుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ పరిశీలించారు. ఆలయ వెనకభాగాన ఏళ్ల తరబడిగా పరిష్కారానికి నోచుకోని డ్రెయినేజీ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లగా.. ప్రభుత్వం నుంచి రూ.50 లక్షలు మంజూరు చేస్తామని, ఆ నిధులతో డ్రెయినేజీని అక్కడినుండి మళ్లించేందుకు ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. భక్తుల సౌకర్యార్థం మరుగుదొడ్ల నిర్మాణం ప్రభుత్వ ఖర్చుతోనే నిర్మిస్తామని తెలియజేశారు. హంద్రీ–నీవా కాలువ ద్వారా వచ్చేనీటిని పైప్‌లైన్ ద్వారా ఆలయానికి తీసుకువచ్చేలా అనుమతి ఇవ్వాలని ఆలయ అధికారులు కోరగా.. ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ దేవదాసు, ఆలయ ఈవో ఎం.విజయరాజు, తదితరులు పాల్గొన్నారు.


