‘ఉపాధి’లో అక్రమాలు
కూడేరు: మండలంలో చేపట్టిన ఉపాధి పనుల్లో భారీగా అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయి. గొటుకూరు, కూడేరు పంచాయతీల పరిధిలో దాదాపు రూ.20 లక్షల మేర అక్రమాలు చోటు చేసుకున్నట్టు సామాజిక తనిఖీ అధికారులు నిగ్గు తేల్చారు. తక్కువ పనిని ఎక్కువగా చేసినట్లు రికార్డుల్లో పొందుపరిచి రూ.లక్షల్లో బిల్లులు చేసుకున్నారని ఈ నెల 3, 8వ తేదీల్లో ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన గ్రామ సభల్లో సామాజిక తనిఖీ జిల్లా రీసోర్స్ పర్సన్ ఆంజనేయులు అభియోగం మోపారు. మెట్టభూముల్లో ఉద్యాన పంటల పథకంలోనూ భారీగా అవినీతికి పాల్పడినట్లుగా రైతులు ఆరోపించడం గమనార్హం. చీనీ, మామిడి మొక్కలు నాటుకున్నా.. ఎరువులు, అంతర పంటల సాగు బిల్లులు ఇవ్వకుండా అధికారులు ఇబ్బంది పెట్టారంటూ గ్రామసభల్లో ఉపాధి సిబ్బందితో 28 మంది రైతులు గొడవకు దిగారు.
కొలతల్లో భారీగా తేడాలు
2024,, ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు ఉపాధి హామీ పథకం కింద పూర్తయిన రూ.7.26 కోట్ల పనులపై గత నెల 26 నుంచి సామాజిక తనిఖీ చేపట్టి ఈ నెల 3, 8వ తేదీల్లో ఆయా గ్రామాల్లో గ్రామసభలు ఏర్పాటు చేసి ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. గొటుకూరు పంచాయతీలో ఏడు నీటి కుంటల్లో పని చేస్తే 4 కుంటల్లో కొలతలు తేడా ఉన్నాయని, ఈ పనుల్లో రూ.10.5 లక్షలు దుర్వినియోగం అయినట్లు సామాజిక తనిఖీ జిల్లా రీసోర్స్ పర్సన్ ఆంజనేయులు అభియోగం మోపారు. అలాగే కూడేరు పంచాయతీ పరిధిలో పీఏబీఆర్ కుడికాలువలో పూడిక తీత పనులు మొదలు పెట్టక ముందు కొలతలను రికార్డుల్లో పొందపరచలేదన్నారు. మొత్తం 6 ఐడీల్లో పని చేస్తే 5 ఐడీల్లో పరిస్థితలో ఎలాంటి మార్పు లేదన్నారు. చెక్ డ్యాంలో పూడిక తీత పనుల కొలతల్లోనూ తేడాలున్నాయని, ఈ రెండింటిలో సుమారు రూ.10 లక్షల వరకు ఎక్కువ బిల్లులు చేసినట్లు అభియోగం మోపారు. ఈ అభియోగాలపై సామాజిక తనిఖీ ఓపెన్ ఫోరంలో ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.
వెలుగు చూసిన సిబ్బంది చేతి వాటం
రెండు పంచాయతీల్లో రూ.20 లక్షల దుర్వినియోగం


