రెడ్‌బుక్ రాజ్యాంగానికి భయపడం
● వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు
అనంతపురం సిటీ: చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్‌బుక్ రాజ్యాంగానికి తాము భయపడేది లేదని, అక్రమ అరెస్ట్‌లు.. తప్పుడు కేసులపై అలుపెరగని పోరాటాలు సాగిస్తామని జిల్లా వైఎస్సార్ విద్యార్థి విభాగం నేతలు స్పష్టం చేశారు. వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ మంగళవారం అనంతపురంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట ఆ విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ యాదవ్‌తో పాటు రాష్ట్ర నాయకులు నవీన్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, నగర అధ్యక్షుడు కై లాష్ మాట్లాడారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయాలని కోరితే జైలులో పెట్టడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. మంత్రి నారా లోకేశ్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే విద్యార్థుల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని సవాల్ చేశారు. ప్రశ్నించడానికే వచ్చానంటూ పదేపదే చెప్పే డీసీఎం పవన్‌కళ్యాణ్ మౌనం వీడి విద్యార్థుల పక్షాన నోరు విప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు మంజునాథ్‌రెడ్డి, నాయకులు తేజ, అనిల్, కిరణ్, ఇంద్రశేఖర్‌రెడ్డి, నాగేంద్ర, రాహుల్‌రెడ్డి, లోకేశ్, ప్రవీణ్, అరవింద్, కార్తీక్, అశోక్, జగదీశ్వర్, కార్తికేయ, బాబా ఇమ్రాన్, సాయి పాల్గొన్నారు.


