విద్యార్థులకు త్రుటిలో తప్పిన ప్రమాదం
గుత్తి: స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని గుత్తి ఆర్‌ఎస్‌లో ఉన్న నంబర్–2 ప్రభుత్వ పాథమిక పాఠశాల విద్యార్థులకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. మంగళవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నాల్గో తరగతి విద్యార్థులు గది నుంచి బయటకు వచ్చిన ఐదు నిమిషాల వ్యవధిలోనే పై కప్పు పెచ్చులూడి పడ్డాయి. ఆ సమయంలో పెద్ద శబ్ధం కావడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. నాల్గో తరగతిలో మొత్తం 17 మంది విద్యార్థులు ఉన్నారు. భోజన విరామానికి ముందే పెచ్చులూడి పడి ఉంటే విద్యార్థులకు ప్రాణాపాయం ఉండేదని, దేవుడి దయ వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదని హెచ్‌ఎం వీరాచారి అన్నారు. పాఠశాలలోని మరో తరగతి గదిలోనూ పెచ్చులూడి పడుతున్నాయని అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.


