మొదలు కాని ఈ–క్రాప్
అనంతపురం అగ్రికల్చర్: చంద్రబాబు ప్రభుత్వం పంటల బీమా పథకాలపై రైతులకు ఏమాత్రమూ ధీమా ఇవ్వడం లేదు. అసలు తమకు సంబంధమే లేదన్నట్లుగా 2023 ఖరీఫ్, రబీ కింద ఇవ్వాల్సిన పరిహారం ఎగ్గొట్టిన సర్కారు... 2024 ఖరీఫ్, రబీది కూడా ఇవ్వకుండా దాటవేత ధోరణి అవలంబిస్తోంది. బీమా పథకాలు రైతుల దరికి చేరకుండా ఏమార్చే కుట్ర చేస్తోంది. ప్రభుత్వ మెప్పు కోసం వ్యవసాయశాఖ, ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా బీమా పథకాలపై మౌనం పాటిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. 2019–2024 మధ్య ఐదేళ్లూ రైతులపై ఎలాంటి భారం పడకుండా అప్పటి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వాతావరణబీమా, ప్రధానమంత్రి ఫసల్‌బీమా పథకాలను ఉచితంగా అమలు చేసి... నాలుగేళ్లు పెద్ద మొత్తంలో రైతులకు పరిహారం కూడా ఇచ్చింది. ఇప్పుడు ఉచిత పంటల బీమాకు మంగళం పాడేసిన చంద్రబాబు సర్కారు రైతుల నుంచి ప్రీమియం రూపంలో రూ.కోట్లు వసూలు చేస్తున్నా... పరిహారం ఇవ్వకుండా మోసపుచ్చుతున్న పరిస్థితి నెలకొంది.
రబీలో ఆరు పంటలకు బీమా..
విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ రబీలో ఫసల్ బీమా కింద పప్పుశనగ, వేరుశనగ, జొన్న, మొక్కజొన్న, వరి పంటలు, వాతావరణ బీమా కింద టమాటకు వర్తింపజేశారు. ఎందుకో కానీ వ్యవసాయశాఖ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ప్రీమియం చెల్లింపు గడువు కూడా ఈ నెల 15న సమీపిస్తున్నా రైతుల్లో అవగాహన కల్పించడం లేదు. జనరలీ సెంట్రల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆధ్వర్యంలో అమలు కానున్న బీమా పథకంలో వ్యవసాయ పంటలకు 1.5 శాతం, ఉద్యాన పంటలకు 5 శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పప్పుశనగ ఎకరాకు రూ.30 వేలు పరిహారం ఖరారు చేయగా అందులో రైతులు తమ వాటా కింద రూ.450 ప్రకారం ప్రీమియం చెల్లించాలి. వేరుశనగకు ఎకరాకు రూ.32 వేలు కాగా.. ప్రీమియం 480 ప్రకారం, జొన్నకు రూ.21 వేలు కాగా ప్రీమియం రూ.315 ప్రకారం, మొక్కజొన్నకు రూ.35 వేలు కాగా ప్రీమియం రూ.525 ప్రకారం, వరికి రూ.42 వేలు కాగా ప్రీమియం రూ.630 ప్రకారం, టమాటాకు రూ.1,600 ప్రకారం రైతులు ప్రీమియం చెల్లించాలన్నారు. వరికి ఈనెలాఖరు వరకు గడువు వుండగా మిగతా పంటలకు ఈనెల 15 లోపు ప్రీమియం గడువు విధించారు. మామిడి పంటకు బీమా ఉందా లేదా అనేది ఇంకా చెప్పడం లేదు. పంట కోత ప్రయోగాల ఫలితాలు, ఆటోమేటిక్ వెదర్ రిపోర్టు ఆధారంగా బీమా పరిహారం లెక్కించి రైతులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే పప్పుశనగ సాగు పూర్తి కాగా వరి, వేరుశనగ, మొక్కజొన్న పంటలు సాగవుతున్నాయి.
రబీకి సంబంధించి ఈ–క్రాప్ (డిజిటల్ క్రాప్ సర్వే) ఇంకా మొదలు పెట్టలేదు. రబీ మొదలై నెలన్నర అవుతున్నా ఎందుకు ప్రారంభించడం లేదనేది వ్యవసాయశాఖ స్పష్టత ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే 80 వేల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగులోకి వచ్చాయి. గత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఈ–క్రాప్‌కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో వివిధ పథకాలకు ప్రామాణికంగా తీసుకుని రైతులకు వివిధ రూపాల్లో ప్రయోజనం కలిగేలా చేశారు.
బీమా కోసం ఎదురుచూస్తున్నాం
ముగుస్తున్న ప్రీమియం గడువు
ప్రభుత్వం నుంచి వెలువడని ప్రకటన
రబీలో వాతావరణ, ఫసల్ బీమా కింద ఆరు పంటలు నోటిఫై
ఇంకా ఈ–క్రాప్ ప్రక్రియ కూడా మొదలు పెట్టని వ్యవసాయశాఖ
జగన్ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేసిన చంద్రబాబు సర్కారు


