ప్రైవేటీకరణపై పెల్లుబికిన వ్యతిరేకత
● మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నడపాలి
● సంతకాలతో స్పష్టం చేసిన జిల్లా ప్రజలు
అనంతపురం: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజల నుంచి వ్యతిరేకత పెల్లుబికింది. ప్రజలకు మెరుగైన వైద్యం, పేదలకు వైద్య విద్యనభ్యసించే అవకాశాలను దూరం చేసేలా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ పేరుతో తనకు కావలసిన వారికి అప్పణంగా కట్టబెట్టేందుకు చేస్తున్న కుట్రలపై భగ్గుమన్నారు. వైద్య కళాశాలలను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగించాలని, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో అక్టోబర్ పది నుంచి జిల్లా వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. రెండు నెలలపాటు నిర్విరామంగా సాగిన ఈ ఉద్యమంలో విద్యార్థులు, యువత, మేధావులు, సామాజిక కార్యకర్తలు, ప్రజా సంఘాలు, మేధావులు తదితర అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా కదిలివచ్చి సంతకాలు చేశారు. ఈ పత్రాలను ప్రస్తుతం వేగంగా డిజిటలైజేషన్ చేస్తున్నారు.
● అనంతపురం అర్బన్‌లో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మంగళవారం విజయవంతమైంది. సంతకాల ప్రతులను బుధవారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక వాహనంలో అనంత క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కార్యాలయానికి తరలిస్తారు.
● రాయదుర్గం నియోజకవర్గం గుమ్మఘట్ట మండలం తాళ్లకెరలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మెట్టు విశ్వనాథరెడ్డి పాల్గొన్నారు.
● ఉరవకొండలో వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మంగళవారం కోటి సంతకాల సేకరణ చేపట్టారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గం అధ్యక్షుడు సాకే పురుషోత్తం, అనిల్, దేవా, నాగరాజ్, పృథ్వీరాజ్, శ్రీకాంత్, అశోక్ పాల్గొన్నారు.


