నేటి నుంచి కళ్యాణదుర్గంలో 144 సెక్షన్
● రేపు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక
కళ్యాణదుర్గం: మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో బుధవారం నుంచి కళ్యాణదుర్గంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి వసంతబాబు అన్నారు. గురువారం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. మంగళవారం డీఎస్పీ రవిబాబు, మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్‌తో కలిసి ఆర్డీఓ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డు కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్యే, ఎంపీలకు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఓటు హక్కు ఉందన్నారు. చైర్మన్ ఎన్నికకు ఓటు హక్కు కలిగిన వారు తమ గుర్తింపు కార్డుతో హాజరుకావాలన్నారు. మున్సిపల్ కార్యాలయానికి 200 మీటర్ల దూరంలోనే సెక్యూరిటీ జోన్‌గా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నిక నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగ కుండా గట్టి బందోబస్తు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. చైర్మన్ ఎన్నికకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు.


