రేపటి నుంచి టెట్
● 21 వరకు పరీక్షల నిర్వహణ
● రెండు సెషన్లలో పరీక్షలు
అనంతపురం అర్బన్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఈ నెల 10 నుంచి 21 వరకు జరగనుంది. పరీక్షల నిర్వహణకు ఏడు కేంద్రాలను ఎంపిక చేశారు. ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. టెట్ నిర్వహణపై కలెక్టర్ సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్ష రెండు సెషన్లుగా ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుదని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, పోలీసు బందోబస్తు నిర్వహంచాలని సూచించారు. నిర్దేశించిన శాఖల అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలి సూచించారు.
పల్స్‌పోలియోకు ఏర్పాట్లు చేయండి
వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 21న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి అవసరమైన ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. పల్స్‌పోలియో కార్యక్రమంపై కలెక్టర్ సోమవారం రెవెన్యూ భవన్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 0–5 ఏళ్ల వయసున్న చిన్నారులు 2,84,774 మంది ఉన్నారన్నారు. 51 పీహెచ్‌సీలు, 25 యూపీహెచ్‌సీలు, 6 పీపీ యూనిట్లు మొత్తం 82 యూనిట్లలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించాలని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 1,451, అర్బన్ పాంతాల్లో 334 మొత్తం 1,785 బూత్‌లలో పల్స్ పోలియో నిర్వహించాలన్నారు. 5,247 మంది సిబ్బంది మొదటి రోజున బూత్ యాక్టివిటీ చేపట్టాలన్నారు. మిగిలిన వారికి ఇంటింటి కార్యక్రమం 22, 23 తేదీల్లో నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్‌నారాయణ్ శర్మ, డీఎంహెచ్‌ఓ ఈబీ దేవి పాల్గొన్నారు.


