సర్వేల భారం తగ్గించండి
● సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గురుస్వామి
అనంతపురం అర్బన్: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై రోజురోజుకూ పెరుగుతున్న సర్వేల భారాన్ని తగ్గించాలని ప్రభుత్వాన్ని ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గురుస్వామి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక గణేనాయక్ భవన్‌లో జరిగిన సచివాలయ ఉద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్వేల భారం తగ్గిస్తామంటూ గతంలో అధికారులు ఇచ్చిన హమీ అమలు కాకపోగా కొత్తగా మరిన్ని సర్వేలు చేర్చడం కక్షపూరిత చర్యగా కనిపిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం తక్షణం స్పందించకపోతే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందన్నారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌డీనాయుడు, నాగేంద్రకుమార్, సమాఖ్య నాయకులు సూర్యప్రకాష్, ప్రదీప్, స్వర్ణ, రఫీ, సురేంద్ర, నితిన్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఇసుక తరలింపు అడ్డగింత
శింగనమల: మండల పరిధిలోని పెన్నా నది, వంకలు, వాగుల నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా జిల్లా మైనింగ్ అధికారులు, పోలీసులు సంయుక్తంగా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. శనివారం రాత్రి ఇసుక రీచ్‌ల్లో తనిఖీలు చేపట్టారు. తరిమెల పెన్నానది పరివాహక ప్రాంతం నుంచి ఇసుకను అక్రమంగా లోడు చేస్తున్న హిటాచీ, ఇసుకతో వెళుతున్న టిప్పరును సీజ్ చేశారు. ఇసుక అక్రమ డంప్‌లోకి తరలిస్తున్న ట్రాక్టరును స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజులుగా ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తున్న రెరండు ట్రాక్టర్లు, రెండు టిప్పర్లను అదుపులోకి శింగనమల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సీఐ కౌలుట్లయ్య, ఎస్‌ఐ విజయ్‌కుమార్ మాట్లాడుతూ... ఇసుక, ఎర్రమట్టి తరలింపులకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా ఉండాలన్నారు. ఇప్పటికే గార్లదిన్నె మండలంలో 11 ట్రాక్టర్ల ఇసుక అక్రమంగా తరలిస్తుండగా మైనింగ్ అధికారులు అడ్డుకుని, వాహనాలను అప్పగించారని వివరించారు.
హంద్రీనీవా కాలువలో
వ్యక్తి గల్లంతు
ఆత్మకూరు: మండలంలోని పంపనూరు వద్ద ఉన్న హంద్రీ నీవా కాలువలో ఆదివారం ఓ వ్యక్తి గల్లంతైనట్లు స్థానికులు తెలిపారు. అయితే అతను ఎవరు అనేది స్పష్టంగా చెప్పలేకపోయారు. కాగా, మతిస్థిమితం లేక గ్రామంలో తిరుగుతుండే పంపనూరు గ్రామానికి చెందిన మల్లన్న (65) ఆదివారం మధ్యాహ్నం కాలువ వద్ద సంచరించడం చూసినట్లు కొందరు పేర్కొన్నారు. దీంతో గల్లంతైన వ్యక్తి మల్లన్న అయి ఉండవచ్చుననే అనుమానాలు బలపడ్డాయి. సర్పంచ్ ఎర్రిస్వామి, వీఆర్వో, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
సర్వేల భారం తగ్గించండి


