డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం : ఎస్పీ
అనంతపురం సెంట్రల్: డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ శ్రమించాలని ఎస్పీ జగదీష్ పిలుపునిచ్చారు. ‘డ్రగ్స్ వద్దు బ్రో.. సైకిల్ తొక్కు బ్రో’ నినాదంతో జిల్లా పోలీసు కార్యాలయం వద్ద ఆదివారం ఆయన సైకిల్ ర్యాలీని ప్రారంభించి, మాట్లాడారు. డ్రగ్స్ వినియోగంపై కలిగే అనర్థాలపై యువతలో చైతన్య పెంచే దిశగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వివరించారు. పిల్లల నడవడిక, ప్రవర్తను సరిచేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. గంజాయి, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై 1972, 112 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. సైకిల్ తొక్కడాన్ని ఓ వ్యాయామంగా నిరంతరం కొనసాగించడం ద్వారా మెరుగైన ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఇలియాజ్‌బాషా, డీఎస్పీలు శ్రీనివాసరావు, మహబూబ్‌బాషా, సూర్యనారాయణరెడ్డి, నీలకంఠేశ్వరరెడ్డి, ఎస్‌ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ, ఇండియన్ రెడ్‌క్రాస్, డిస్కవరీ అనంతపురం, లలితమ్మ హెల్పింగ్ హ్యాండ్స్, యాపిల్స్ తదితర ఎన్జీఓ సంస్థల ప్రతినిధులు, పోలీసు అధికారులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
బైక్‌ల ఢీ – వ్యక్తి మృతి
బెళుగుప్ప: ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు... బెళుగుప్ప మండలం వెంకటాద్రిపల్లిలో వ్యాపారంతో కుటుంబాన్ని పోషించుకుంటున్న రాసినేని చంద్రమౌళి(65)కి భార్య శకుంతల, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆదివారం సాయంత్రం బెళుగుప్పలో దుకాణానికి అవసరమైన సరుకులు కొనుగోలు చేసి, రాత్రికి ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో ఎదురుగా శీర్పి గ్రామానికి చెందిన ద్విచక్ర వాహనంపై వస్తున్న తిప్పేస్వామి ఢీకొనడంతో చంద్రమౌళితో పాటు తిప్పేస్వామి, ఆయన భార్య భూలక్ష్మి రోడ్డుపై పడ్డారు. చంద్రమౌళి తలకు బలమైన గాయాలయ్యాయి. స్వల్పగాయాలతో తిప్పేస్వామి, భూలక్ష్మి దంపతులు బయటపడ్డారు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న చంద్రమౌళిని స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా కళ్యాణదుర్గంలోని సీహెచ్‌సీకి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. తిప్పేస్వామికి కళ్యాణదుర్గం ఆస్పత్రిలో చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.


