సైనికుల త్యాగాలు వెలకట్టలేనివి
అనంతపురం అర్బన్: దేశ రక్షణలో సైనికులు, మాజీ సైనికులు అందించిన సేవలు, త్యాగాలకు వెలకట్టలేమని కలెక్టర్ ఓ.ఆనంద్ అన్నారు. సైనికుల కుటుంబాలకు ప్రతి పౌరుడూ తోడుగా ఉండాలని పిలుపునిచ్చారు. సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సాయుధ దళాల పతాక నిధి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని తన వంతు విరాళం అందజేసి, మాట్లాడారు. అందరి సహకారంతో సాయుధ దళాల పతాక నిధికి విరాళాలను సేకరించాలని సూచించారు. జిల్లాలో అర్హులైన మాజీ సైనికులకు, అమరులైన సైనిక కుటుంబాలకు భూ పంపిణీకి చర్యలు చేపట్టామన్నారు. అంతకు ముందు పతాక దినోత్సవ ర్యాలీని ఆర్ట్స్ కళాశాల నుంచి టవర్ క్లాక్ వరకు నిర్వహించి విరాళాలు సేకరించారు. కార్యక్రమంలో సైనిక సంక్షేమ శాఖ అధికారి తిమ్మప్ప, సిబ్బంది గిరీష్, బాబాఫకృద్ధీన్, అమర్‌నాథ్, అనిల్, రమాదేవి, మాజీ సైనికులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు. కాగా, హరే రామ హరే కృష్ణ సేవాసమితి భక్తుడు పతాక నిధికి చెక్ రూపంలో రూ.10 వేలు విరాళాన్ని కలెక్టర్ ఆనంద్ చేతుల మీదుగా సైనిక సంక్షేమ శాఖకు అందజేశారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ పద్మశ్రీ, మాజీ సైనికుల సంక్షేమ సంఘం నాయకులు విశ్వేశ్వరరావు, సైనిక వితంతువులు తమ విరాళాలు అందించారు.


