నేడు కలెక్టరేట్‌లో పరిష్కార వేదిక
అనంతపురం అర్బన్ : కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజాసమస్యల పరిష్కారవేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా విన్నవించుకోవచ్చని సూచించారు. గతంలో ఇచ్చిన అర్జీలకు సంబంధించి పరిష్కార స్థితిని కాల్‌సెంటర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. ప్రజలు తమ అర్జీలను పరిష్కార వేదిక ద్వారానే కాకుండా meekosam.ap.gov.i n ద్వారా కూడా సమర్పించవచ్చని తెలిపారు.
కమ్మేస్తున్న పొగమంచు
● ఉష్ణోగ్రతల తగ్గుదలతో
పెరుగుతున్న చలి
అనంతపురం అగ్రికల్చర్: పొగమంచు ‘అనంత’ను కమ్మేస్తోంది. ఎదురుగా ఐదు అడుగుల దూరం కూడా సరిగా కనిపించనంత స్థాయికి చేరుకుంది. వారం రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా ఇదే రకమైన వాతావరణం నెలకొంది. సాయంత్రం 5 గంటలకే పొగమంచు ఉండటంతో చీకట్లు అలుముకున్నట్లు కనిపిస్తోంది. వేకువజామున, ఉదయం 9 గంటల వరకు పరిస్థితి ఇలాగే ఉంది. పల్లె ప్రాంతాలు, నగర శివార్లు, జాతీయ రహదారులు దట్టమైన పొగమంచు మరింత అధికంగా కనిపిస్తోంది. దీంతో వాహనదారులు బాగా ఇబ్బంది పడుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు 28 నుంచి 32 డిగ్రీల మధ్య నమోదవుతుండగా.. రాత్రిళ్లు 16 నుంచి 20 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నందన చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు చలి గజ గజ వణికిస్తోంది. దీంతో రైతులు, శ్రామికవర్గాలు, పిల్లలు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. పొగమంచు వల్ల గాలికాలుష్యం అధికంగా ఉన్నట్లు చెబుతున్నారు. అనారోగ్యకరమైన వాతావరణం ఉన్నందున చలికాలంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నెలాఖరు, జవవరిలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే సూచనలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
చెర్లపల్లి–యలహంక మధ్య ప్రత్యేక రైళ్లు
గుంతకల్లు: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సోమ, మంగళవారాలు (8, 9 తేదీల్లో) చెర్లపల్లి–యలహంక–చెర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం రాత్రి 10 గంటలకు చెర్లపల్లి జంక్షన్ నుంచి బయలుదేరి మంగళవారం ఉదయం 11.45 గంటలకు యలహంక రైల్వేస్టేషన్‌కు చేరుతుందని పేర్కొన్నారు. తిరిగి ఈ రైలు అదే రోజు మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి చెర్లపల్లి జంక్షన్‌కు బుధవారం ఉదయం 4.30 గంటలకు చేరుతుందని తెలిపారు. ఈ రైళ్లు కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబుబ్‌నగర్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, అనంతపురం, ధర్మవరం, శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం, హిందూపురం మీదుగా రాకపోకలు సాగిస్తాయని తెలిపారు. ఈ రెండు రోజులు సింగిల్ సర్వీసుల్లో మాత్రమే ఈ రైళ్లు నడుపుతున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
నేడు డయల్ యువర్
సీఎండీ
అనంతపురం టౌన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు డయల్ యువర్ ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం నిర్వహించనున్నారు. విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు 89777 16661 నంబర్‌కు కాల్ చేయాలని సీఎండీ శివశంకర్ తెలిపారు.
నేడు కలెక్టరేట్‌లో పరిష్కార వేదిక
నేడు కలెక్టరేట్‌లో పరిష్కార వేదిక


