పోలీసు శాఖలో హోంగార్డుల వ్యవస్థ కీలకం
● జిల్లా ఎస్పీ జగదీష్
● ఘనంగా హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం
అనంతపురం సెంట్రల్: పోలీసుశాఖలో హోంగార్డు వ్యవస్థ కీలకంగా మారిందని జిల్లా ఎస్పీ జగదీష్ పేర్కొన్నారు. శనివారం పోలీసు పరేడ్ మైదానంలో 63వ హోంగార్డుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా జిల్లా ఎస్పీ సాయుధ హోంగార్డుల ప్లటూన్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ హోంగార్డులు పోలీసులతో సమానంగా అన్ని రకాల సేవలు అందిస్తున్నారన్నారు. సాధారణ విధుల నుంచి క్లిష్టతర విధుల్లోనూ పాల్గొంటున్నారన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, డ్రైవింగ్, కంప్యూటర్ తదితర విధుల్లో వారి పాత్ర కీలకంగా ఉంటోందన్నారు. హోంగార్డుల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. వారి పిల్లలు చదువుల ప్రోత్సాహంలో భాగంగా మెరిట్ స్కాలర్‌షిప్‌లు ఇస్తున్నట్లు తెలిపారు. అనంతరం హోంగార్డుల సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ రకాల పోటీల్లో ప్రతిభ కనబరిచిన హోంగార్డులకు ఎస్పీ ప్రశంసాపత్రాలు, మెమొంటోలు అందించారు. 500 మందికి బందోబస్తు విధుల టీషర్టులు అందజేశారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ ఇలియాజ్‌బాషా, డీఎస్పీలు శ్రీనివాసరావు, మహబూబ్‌బాషా, నీలకంఠేశ్వరరెడ్డి, పలువురు సీఐలు, ఏఆర్ సిబ్బంది, పోలీసు అధికారుల సంఘం నాయకులు పాల్గొన్నారు.
బైక్ అదుపు తప్పి యువకుడి మృతి
గుత్తి రూరల్: కరిడికొండ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం రాత్రి ద్విచక్రవాహనం అదుపు తప్పి బోల్తా పడి జే.రవి(29) మృతి చెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు..కె.ఊబిచెర్ల గ్రామానికి చెందిన శ్రీరాములు కుమారుడు రవి పెయింటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రవి చిన్న కుమారుడు పవన్‌కుమార్ పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు కేక్ కొనుగోలు చేసేందుకు గుత్తికి వెళ్లి వస్తుండగా, రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య శారద, కుమారులు కరుణకుమార్, పవన్‌కుమార్ ఉన్నారు.


