చియ్యేడులో అగ్ని ప్రమాదం
● వంట గ్యాస్ లీకై చెలరేగిన మంటలు
● మహిళకు తీవ్ర గాయాలు
రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండలం చియ్యేడు గ్రామంలో వంట గ్యాస్ లీకై మంటలు చెలరేగడంతో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. స్థానికులు తెలిపిన మేరకు... గ్రామానికి చెందిన వడ్డే శ్రీనివాసులు, సాలమ్మ దంపతులు వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. గురువారం సాయంత్రం ఇంటికి తాళం వేసి ధర్మవరంలో నివాసముంటున్న కుమార్తె, అల్లుడుని పలకరించేందుకు వెళ్లారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు ఇంటికి చేరుకున్నారు. ఇంటి బయట భార్యను వదిలి వడ్డే శ్రీనివాసులు పని కోసం వెళ్లిపోయాడు. అప్పటికే వంట గ్యాస్ లీకై ఇల్లంతా వ్యాపించింది. తలుపులు తీసి లోపలకు ప్రవేశించిన సాలమ్మ లైట్ స్విచ్ వేయడంతో ఒక్కసారిగా పెద్దశబ్ధంతో మంటలు చెలరేగాయి. ఘటనలో సాలమ్మ తీవ్రంగా గాయపడింది. చుట్టుపక్కల వారు స్పందించి వెంటనే సాలమ్మను అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. 80 శాతం కాలిన గాయాలైనట్లుగా గుర్తించిన వైద్యుల సూచన మేరకు... మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. కాగా, పేలుడు ధాటికి శ్రీనివాసులు ఇంటితో పాటు ఇరువైపులా ఉన్న సోదరుల ఇళ్లు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న ఇటుకలపల్లి పోలీసులు, రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.


