నీటి సరఫరాలో నిర్లక్ష్యం వీడండి
పుట్లూరు: వర్షాభావ పరిస్థితులతో వట్టిపోయిన చెరువులకు నీటిని సరఫరా చేయడంలో మరీ ఇంత నిర్లక్ష్యం తగదని, ఇప్పటికై నా స్పందించి వెంటనే చెరువులను నీటితో నింపాలని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీకి వైఎస్సార్‌సీపీ నాయకులు సూచించారు. గురువారం పుట్లూరు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే అధ్యక్షతన ప్రజాదర్బార్ నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ మహేశ్వరరెడ్డి, జిల్లా కార్యదర్శి విష్ణునారాయణ తదితరులు ఎమ్మెల్యేను కలసి వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. చెరువులకు నీటి సరఫరాతో పాటు అరటి రైతులను ఆదుకోవాలని కోరారు. సుబ్బరాయసాగర్ వద్ద గేట్లు మరమ్మతులకు గురి కావడంతో నీటి సరఫరా ఆలస్యమైనట్లు ఎమ్మెల్యే తెలపడంతో నాయకులు అసహనం వ్యక్తం చేశారు. అరటి రైతుల సమస్యలు వివరిస్తుండగా వైఎస్సార్‌సీపీ నేతలను సీఐ సత్యబాబు, పోలీసులు అడ్డుకుని బలవంతంగా అక్కడి నుంచి పక్కకు లాక్కెళ్లారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి రమణాయాదవ్, నాయకులు నాగేశ్వరరెడ్డి, సురేష్‌రెడ్డి, నారాయణస్వామి, శేఖర్, సాంబశివారెడ్డి పాల్గొన్నారు.


