సెపక్‌తక్రా ఓవరాల్ చాంపియన్ కృష్ణా
ఉరవకొండ రూరల్: గత రెండు రోజులుగా ఉరవకొండ సెంట్రల్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న అండర్ –14, 19 రాష్ట్ర స్థాయి సెపక్ తక్రా బాలబాలికల క్రీడా పోటీలు సోమవారం ముగిసాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 280 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అండర్ –19 బాలబాలికల విభాగంలో కృష్ణా జిల్లా మొదటి స్థానం, రెండో స్థానంలో అనంతపురం, మూడో స్థానంలో పశ్చిమ గోదావరి జిల్లా జట్లు నిలిచాయి. అండర్– 14 బాలుర విభాగంలో మొదటి స్థానంలో తూర్పు గోదావరి, రెండో స్థానంలో పశ్చిమ గోదావరి, మూడో స్థానంలో కర్నూలు, బాలికల విభాగంలో మొదటి స్థానంలో నెల్లూరు, రెండో స్థానంలో పశ్చిమ గోదావరి, మూడో స్థానంలో అనంతపురం జిల్లా జట్లు నిలిచాయి. విజేతలకు ఆల్ ఇండియా సెపక్ తక్రా పెడరేషన్ ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, కృష్ణా జిల్లా ఏపీ స్కూల్ గేమ్స్ పరిశీలకుడు రమేష్, ఉరవకొండ ఎంఈఓలు ఈశ్వరప్ప, రమాదేవి, పాఠశాల హెచ్‌ఎం రాజేశ్వరి, ఎస్‌కే ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం సత్యనారాయణ మెడల్స్ ప్రదానం చేశారు. పోటీలను పీడీలు మారుతీ ప్రసాద్, పుల్లా రాఘవేంద్ర, ప్రభాకర్, చంద్రశేఖర్ రెడ్డి, నాగరాజు, ముద్దలాపురం శివ తదితరులు పర్యవేక్షించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారిని జాతీయ స్థాయి పోటీల్లో ప్రాతినిథ్యం వహించే ఏపీ జట్టుకు ఎంపిక చేశారు.
పరిష్కార వేదికకు 105 వినతులు
అనంతపురం సెంట్రల్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 105 వినతులు అందాయి. ఎస్పీ జగదీష్ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. త్వరితగతిన బాధితులకు పరిష్కారం చూపాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో మహిళా డీఎస్పీ మహబూబ్‌బాషా, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి ప్రారంభం
మడకశిరరూరల్: మండలంలోని నీలకంఠాపురం గ్రామంలో దివంగత శ్రీరామరెడ్డి కుటుంబ సభ్యులు రూ.6 కోట్లతో నూతనంగా నిర్మించిన ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ (సూపర్ స్పెషాలిటీ కంటి ఆస్పత్రి) సోమవారం ప్రారంభమైంది. దాతలు డాక్టర్ శాంతా, జయరామ్, స్వామి జపానంద తదితరులు రిబ్బన్ కత్తిరించి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎల్వీ ప్రసాద్ నేత్ర వైజ్ఞానిక సంస్థ చైర్మన్ జీఎన్ రావు మాట్లాడుతూ హైదరాబాద్‌లో 34 ఏళ్లు క్రితం ఏర్పాటైన కంటి ఆస్పత్రి ద్వారా ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. మడకశిరలో ఏర్పాటైన ఆస్పత్రి ద్వారా 5 లక్షల మందికి వైద్య సేవలు అందించడమే సంస్థ లక్ష్యమన్నారు. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని పేర్కొన్నారు. అవసరమున్న వారికి ఇంటి వద్దకే వెళ్లి వైద్య సేవలు అందిస్తామన్నారు. మూడేళల్లో 10 గ్రామీణ కంటి పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. కంటికి సంబంధించిన అన్నిరకాల వైద్య సేవలు, ఆపరేషన్లు 90 శాతం వరకూ నీలకంఠాపురం ఆస్పత్రిలోనే నిర్వహిస్తామన్నారు. మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతూ ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి సేవలు నీలకంఠాపురంలోనూ ప్రారంభించడం హర్షణీయమన్నారు. ఉత్తమ సేవలతో ప్రపంచస్థాయిలో మంచి పేరు తేవాలన్నారు. వైఎస్సార్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ కంటి చూపు సమస్యలతో సతమతమవుతున్న ప్రతి ఒక్కరూ ఉచితంగా వైద్య చికిత్సలు చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారాలన్నారు. మాజీ మంత్రి నర్సేగౌడ్, మాజీ ఎంపీ తలారి రంగయ్య, మాజీ ఎమ్మెల్యేలు వైటీ ప్రభాకర్‌రెడ్డి, డాక్టర్ తిప్పేస్వామి, సుధాకర్ , ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వైస్ చైర్మన్ రాజీవ్‌రెడ్డి, అసోసియేట్ డైరెక్టర్ రాజశేఖర్, మాజీ పీసీసీ అధక్షుడు గిడుగు రుద్రరాజు, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం, సీడబ్ల్యూసీ మెంబర్ కొప్పలరాజు, మాజీ ఎమ్మెల్యే ఈరన్న, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రవిశేఖర్‌రెడ్డి, సేవమందిరం విద్యా సంస్థ అధినేత కేటీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
							సెపక్‌తక్రా ఓవరాల్ చాంపియన్ కృష్ణా
							సెపక్‌తక్రా ఓవరాల్ చాంపియన్ కృష్ణా

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
