
పెన్షనర్లపై ప్రభుత్వాల దాడి
అనంతపురం అర్బన్: ‘‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షనర్లపై దాడి చేస్తున్నాయి. పెన్సనర్లను భారంగా భావిస్తున్నాయి. రావాల్సిన రాయితీలు, డీఆర్ వంటి ఆర్థిక ప్రయోజనాలు ఇవ్వడం లేదు. అధికారం చేపట్టి ఏడాదవుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు కనీసంగా పట్టించుకోలేదు. వృద్ధులు వీరేమి చేస్తారనని అనుకోకండి. మేం తల్చుకుంటే మిమ్మల్ని గద్దెదింపుతాము’’ అంటూ కూటమి ప్రభుత్వంపై పెన్షనర్ల సంఘం నాయకులు ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పెద్దన్న గౌడ్ అధ్యక్షతన మంగళవారం కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాకు మాజీ ఎమ్మెల్సీ గేయానంద్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సుదీర్ఘకాలం సేవలందించిన ఉద్యోగులకు పదవీ విరమణ చేసిన తరువాత రాయితీలు మంజూరు చేయకుండా ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం బాధాకరమన్నారు. ఎన్నో పోరాటాలు చేసిన సాధించుకున్న వాటిని ఒక్కొక్కటిగా రద్దు చేయడం ప్రభుత్వాల నిరంకుశ వైఖరికి నిదర్శమన్నారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.పెద్దన్న గౌడ్, శీలా జయరామప్ప మాట్లాడుతూ కూటమి గెలుపుకోసం గత ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం తిరిగామన్నారు. అధికారంలోకి వస్తే ప్రయోజనాలు చేకూరుస్తామని చంద్రబాబు మాటిచ్చి ఏడాదవుతున్నా పట్టించుకోలేదని మండిపడ్డారు. పెన్షనర్లకు రావాల్సిన మూడు డీఆర్‌లు, 11వ పీఆర్‌సీ బకాయిలు తక్షణం చెల్లించాలన్నారు. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరించాలన్నారు. అనంతరం కలెక్టర్ వినోద్‌కుమార్‌కు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని నాయకులు అందజేశారు. ధర్నాకు ఏపీఎన్‌జీఓ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, చంద్రమోహన్, నగర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, ఇతర ఉద్యోగ సంఘాలు, సీఐటీయూ నాయకులు సంఘీభావం ప్రకటించారు. ధర్నాలో పెన్షనీర్ల సంఘం ఆర్గనైజింగ్ కార్యదర్శి ప్రభాకర్, కోశాధికారి, సీనియన్ సిటిజన్ అధ్యక్షుడు రమణ, రామకృష్ణ, నియోజకవర్గాల నాయకులు, పెన్షనర్లు పాల్గొన్నారు.