
వెల్లువెత్తిన వినతులు
అనంతపురం అర్బన్: సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలంటూ అధికారులకు ప్రజలు విన్నవించుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజాసమస్యల పరిష్కార వేదిక’లో అర్జీలు వెల్లువెత్తాయి. వివిధ సమస్యలపై 800 వినతులు అందాయి. అధికంగా ‘తల్లికి వందనం’, గురుకుల పాఠశాలల్లో సీట్ల కేటాయింపుపై అర్జీలు సమర్పించారు. కలెక్టర్ వి. వినోద్‌కుమార్‌తో పాటు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, డీఆర్‌ఓ ఎ.మలోల, డిప్యూటీ కలెక్టర్లు రామకృష్ణారెడ్డి, ఆనంద్, రామ్మోహన్, తిప్పేనాయక్, జిల్లావ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ అర్జీలు స్వీకరించారు. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ప్రతి అర్జీకి నాణ్యమైన పరిష్కారం చూపించడంతో పాటు ఎండార్స్‌మెంట్ ఇవ్వాలని ఆదేశించారు.
కలెక్టర్‌ను సన్మానించిన అర్జీదారు
సమస్యను పరిష్కరించారంటూ కలెక్టర్ వినోద్ కుమార్‌ను ఓ మాజీ సైనికుడి కుమార్తెలు సన్మానించారు. గుంతకల్లుకు చెందిన మాజీ సైనికుడు మహమ్మద్‌కు 1971లో ప్రభుత్వం ఐదెకరాల భూమి కేటాయించింది. అయితే ఈ భూమి కబ్జాకు గురికావడంతో కలెక్టర్‌కు ఆయన కుమార్తెలు విన్నవించారు. దీనిపై విచారణ చేసిన కలెక్టర్.. భూమిని కబ్జాదారుల నుంచి విముక్తి కల్పించడంతో పాటు చుక్కల భూమి జాబితా నుంచి తొలగించి ఎన్‌ఓసీ జారీ చేశారు. తమ అర్జీని పరిష్కరించి న్యాయం చేశారంటూ కలెక్టర్‌ను మాజీ సైనికుడి కుమార్తెలు హబీబున్నీసాబేగం, సాహెబేగం సన్మానించారు.
ఈ వృద్ధురాలి పేరు లక్ష్మిదేవి. వయసు 70 ఏళ్లు. అనంతపురం రూరల్ పరిధిలోని కళ్యాణదుర్గం రోడ్డు సమీపంలోని కాలనీలో నివాసముంటోంది. పింఛను కోసం దరఖాస్తు చేసుకుని ఏడాదవుతున్నా మంజూరు కాలేదని వాపోయింది. తనకు ఎవరూ లేరని, తమ్ముడు మోహన్‌రెడ్డి ఇంట్లో ఉంటున్నానని చెప్పింది. పింఛను మంజూరు చేయించి ఆదుకోవాలని కలెక్టర్‌ను వేడుకుంది.
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు 800 అర్జీలు
‘తల్లికి వందనం’ అందలేదని, గురుకులాల్లో సీట్లు కేటాయించాలని అధికంగా వినతులు

వెల్లువెత్తిన వినతులు