
నకిలీ బంగారంతో బురిడీ
గుంతకల్లు: నకిలీ బంగారంతో ఫైనాన్స్ కంపెనీలను బురిడీ కొట్టిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ఇందుకు సంబంధించిన వివరాలను కసాపురం పోలీసుస్టేషన్‌లో గురువారం ట్రైనీ డీఎస్పీ అష్రఫ్ ఆలీ వెల్లడించారు. గుంతకల్లు పట్టణంలోని రాజేంద్రనగర్‌కు చెందిన తిమ్మయ్య గారి భార్గవ్‌కుమార్, తెల్ల శివానంద్ బుధవారం 4 బంగారు గాజులు తీసుకుని పట్టణంలోని కరూర్ వైశ్య బ్యాంకులో తాకట్టు పెట్టేందుకు వెళ్లారు. అవి నకిలీవిగా గుర్తించిన బ్యాంకు అప్రైజర్ ద్వారా విషయం తెలుసుకున్న అసిస్టెంట్ మేనేజర్ వెంకటరెడ్డి నిలదీయడంతో వారు ఉడాయించారు. దీనిపై అసిస్టెంట్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కసాపురం ఎస్‌ఐ వెంకటస్వామి వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. గురువారం కసాపురం రోడ్డులోని ఎస్‌బీఐ బజార్ బ్రాంచ్‌లో మరోసారి నకిలీ బంగారం కుదువ పెట్టడానికి భార్గవ్‌కుమార్, శివానంద్ రాగా.. అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే మొత్తం ముఠా గుట్టు రట్టయింది.
క్రాంతి కుమార్, వేణుగోపాల్ సూత్రధారులు
నకిలీ బాగోతంలో గుంతకల్లులోని ఫక్కీరప్ప కాలనీకి చెందిన చాగంటి క్రాంతి కుమార్, కమ్మర వేణుగోపాల్ సూత్రధారులుగా తేలింది. బంగారం వ్యాపారం చేసే వీరు 70 శాతం సిల్వర్‌పై 30 శాతం బంగారు కోటింగ్ వేసి ఉంగరాలు, గాజులు తదితర వాటిని తయారు చేసేవారు. స్థానిక మోమినాబాద్‌కు చెందిన జావేద్‌తో నకిలీ బంగారంపై హాల్‌మార్క్ గుర్తు వేయించాక.. ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం, ఇతర ప్రైవేట్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి లక్షలాది రూపాయల రుణం తీసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. కర్నూలుకు చెందిన ఎరుకల శ్రీనివాసులు, పులిపాటి నరేంద్ర, మేకల శ్రీనివాసులు, మల్లెమాల నరేష్‌కు కూడా నకిలీ బంగారం తక్కువ రేటుకు అమ్మేవాళ్లని తేలింది. నిందితులు 9 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 39 గ్రాముల నాలుగు బంగారు గాజులు, 13 నకిలీ బంగారు ఉంగరాలు, 5 వెండి ఉంగరాలు, 145 గ్రాముల కాపర్‌వైర్, 15 గ్రాముల వెండి కడియం, 4 వెండి కాళ్ల పట్టీలతోపాటు రూ.4 లక్షలు విలువ చేసే వెయింగ్ మిషన్ (హాల్‌మార్క్ ముద్ర వేసే)తోపాటు రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నట్లు ట్రైనీ డీఎస్పీ వివరించారు. నిందితుల అరెస్టులో ప్రతిభ చూపిన కానిస్టేబుల్స్ జాఫర్, కిషోర్‌కుమార్, ఓబులేసు, మహబుబ్‌బాషా, అశోక్, నజీర్‌లను అఽభినంచించారు.
‘ఆర్థో’లో మృతిపై విచారణ
అనంతపురం మెడికల్: ఈ నెల 9న ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని ఆర్థో విభాగంలో చోటు చేసుకున్న యువకుడి మృతిపై ఆస్పత్రి అధికారులు విచారణ చేపట్టారు. ఉరవకొండ మండలం నింబగల్లు గ్రామానికి చెందిన రాజేష్ (22) కాలు నొప్పితో బాధపడుతూ తొలుత ఓ ప్రైవేట్ నర్శింగ్ హోంలో, అనంతరం సర్వజనాస్పత్రిలో చికిత్స పొంది మృతి చెందిన అంశంపై ‘మేడా’లో అడ్మిషన్.. ‘జీజీహెచ్’లో డెత్’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో వెలువడిన కథనంపై జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆత్మారాం స్పందించారు. మృతిపై విచారణకు ఆదేశించారు. ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో మరో ఇద్దరు ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్‌తో కమిటీను ఏర్పాటు చేశారు. మృతి గల కారాణాలపై నివేదిక సమర్పించాలని కోరారు. ఇదిలా ఉండగా స్వయంగా సూపరింటెండెంట్ డాక్టర్ ఆత్మారాం తన సొంత మేడా నర్సింగ్ హోం నుంచి జీజీహెచ్‌కు బదిలీ చేసిన కేసులో రోగి మృతి చెందిన అంశంపై విచారణలో పారదర్శకత లోపించే అవకాశముందనే చర్చ జీజీహెచ్‌లో జోరుగా సాగుతోంది.