
హద్దుల్లేని ఇసుక దందా
హగరి.. హరీ
● డీ హీరేహాళ్ మండలం నుంచి రోజూ వందల టిప్పర్లు కర్ణాటకకు
● రూ. కోట్లు కొల్లగొడుతున్న టీడీపీ నేతలు
● మైనింగ్ అధికారులు, పోలీసులు పట్టించుకోకపోవడంతో ఇష్టారాజ్యం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఇసుక మాఫియాకు రాయదుర్గం నియోజకవర్గం అడ్డాగా మారింది.ఎలాంటి దొంగ సరుకై నా సరే సరిహద్దు ఆవలకు వెళితే ఇక అడిగేవారుండరు. దీన్ని ఆసరాగా చేసుకుని రోజూ వందలాది టిప్పర్ల ఇసుక, మట్టి కర్ణాటకకు తరలిస్తున్నారు. ఏపీలో లభ్యమయ్యే ఇసుక నాణ్యతగా ఉండడంతో కర్ణాటకలో భారీ డిమాండ్ ఉంటుంది. దీంతో హగరి నదిలో 15 మీటర్ల వరకూ తవ్వి ప్రొక్లైన్ల ద్వారా టిప్పర్లలో ఎత్తి పంపిస్తున్నారు.
టీడీపీ నేతల పాత్ర..
ఇసుక దందాలో టీడీపీకి చెందిన ముఖ్య నేతలు కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలు స్తోంది. నేతల హస్తం లేకుండా రోజుకు 200కు పైగా టిప్పర్లు వెళ్లలేవు. దందాలో వచ్చే సొమ్ములో స్థానిక నేతలు, ముఖ్య నేతలు 50ః50 పద్ధతిలో పంచుకుంటున్నట్టు తెలుస్తోంది. రాత్రింబవళ్లు టిప్పర్లు జాతరను తలపిస్తున్నా అడిగేవారు కరువయ్యారు. స్థానిక నేతల భయానికి గ్రామస్తులు కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితి నెలకొంది.
మొలకల్మూరు కేంద్రంగా అక్రమాలు..
ఏపీ నుంచి వెళ్లే ఇసుకను కర్ణాటకలోని మొలకల్మూరు నియోజకవర్గంలో నిల్వ చేస్తున్నారు. డి.హీరేహాళ్ మండలంలోని కాదలూరు, బాదనహాళ్ నుంచి ఇసుక తీసుకుని మొలకల్మూరులో డంప్ చేస్తున్నారు. బాదనహాళ్ నుంచి 200 మీటర్ల లోపే ఏపీ బార్డర్ ముగుస్తుంది. మొలకల్మూరులోకి ఇసుక వెళ్లిందంటే ఇక ఏపీ పోలీసులు ఏమీ అనలేరు. అక్కడ నుంచి బళ్లారి తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒక టిప్పర్ ఇసుక ధర ఏపీలో రూ.20 వేలు ఉంటే కర్ణాటకలో రూ.70 వేల వరకూ అమ్ముతున్నారు. ఏడాదిగా వేదవతి హగరి నదుల్లో ఇసుకను తోడేళ్లలా తవ్వేస్తున్నా అడిగే నాథుడే లేరు. టీడీపీ నేతలకు ఇసుక వ్యాపారమే ప్రధాన ఆదాయ వనరుగా మారిందని స్థానికులు చెప్పుకుంటున్నారు.
కర్ణాటక పోలీసుల దాడులు
విచిత్రమేమంటే ఏపీ నుంచి తరలిపోయే ఇసుక టిప్పర్లను మన పోలీసులు పట్టుకోవడం లేదు. అయితే, కర్ణాటకలో ఇసుక రీచ్‌ల లైసెన్సులు తీసుకున్న వారు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఏపీ–కర్ణాటక సరిహద్దులో ఇసుక లారీలను పట్టుకున్నారు. కొన్నింటిపై కేసులు నమోదు చేసినట్టు తెలిసింది. ఏపీ నుంచి వచ్చే ఇసుకను నియంత్రించాలంటూ ఇక్కడి పోలీసులను కర్ణాటక పోలీసులు కోరినట్టు తెలిసింది. దీంతో రాయదుర్గం పోలీసుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. ఇసుక దందాను నియంత్రిస్తే ‘పచ్చ’ నేతలకు కోపం.. మరోవైపు కర్ణాటక పోలీసుల ఒత్తిడి.. మధ్యలో ఏం చేయాలో తోచక తీవ్ర ఆలోచనలో పడినట్లు తెలిసింది.

హద్దుల్లేని ఇసుక దందా