
ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం
అనంతపురం అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అశాసీ్త్రయ విధానాలతో రాష్ట్రంలో విద్యారంగం తీవ్ర ఒత్తడికి గురవుతోందని, ఇదే తీరు కొనసాగిస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూటమి సర్కార్‌ను ఏపీటీఎఫ్ నాయకులు హెచ్చరించారు. పాఠశాలల పరిరక్షణ, పీఆర్సీ, మధ్యంతర భృతి, డీఏ మంజూరు అంశాలపై శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు రాయల్ వెంకటేష్ అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో ఆయనతో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి సిరాజుద్ధీన్, రాష్ట్ర కార్యదర్శి పాతిరెడ్డి, పూర్వపు అధ్యక్ష, కార్యదర్శులు రఘురామిరెడ్డి, నరసింహులు మాట్లాడారు. దశాబ్ధాల నుంచి అమలులో ఉన్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రాథమిక పాఠశాల వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోదని మండిపడ్డారు. ఫౌండేషన్ పాఠశాలల పేరుతో ప్రాథమిక పాఠశాలల స్థానంలో ఒకటి, రెండు తరగతులకు మాత్రమే పాఠశాలను ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఒక్కొక్క రకమైన పాఠశాలలో ఒక్కో విధమైన అశాసీ్త్రయ విధానాలను అవలంభిస్తూ ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తిని పాటిస్తోందన్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగుల ఆర్థిక సమస్యలను ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని ధ్వజమెత్తారు. 12వ పీఆర్సీ కమిషన్ నియామకం, మధ్యంతర భృతి, మూడు పెండింగ్ డీఏల మంజూరులో ఆలస్యాన్ని ఇకపై ఉపేక్షించబోమన్నారు. రెండవ దశ పోరాటంలో భాగంగా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించినట్లుగా తెలిపారు. మూడవ దశలో భాగంగా రాష్ట్రస్థాయిలో ఈ నెల 14న ధర్నా తలపెట్టామన్నారు. కార్యక్రమంలో నాయకులు దేశాయి నాగరాజు, డేనియల్ మోహన్‌రెడ్డి, రామాంజనేయులు, సతీష్‌కుమార్, సర్ధార్‌వలి, వెంకటరమణ, శ్యాం, రవి, కృష్ణ, లక్ష్మీప్రసాద్, ప్రేమావతి, అంజలీదేవి, వన్నప్ప, బాలరామ్మోహన్, ఓబులేసు, శ్రీనివాసులు, నాగభూషణం, శ్రీనివాసులు, సూర్యనారాయణ, రామచంద్ర, తదితరులు పాల్గొన్నారు.
ధర్నాలో ఏపీటీఎఫ్ నాయకులు