అనంతపురం: జిల్లా బహిష్కరణకు గురైన 8 మందికి పోలీసులు నోటీసులు అందజేసి గురువారం జిల్లా సరిహద్దులు దాటించారు. మట్కాను కొనసాగిస్తున్న నలుగురితోపాటు ఇతర రాష్ట్రాల మద్యం విక్రయాలకు సంబంధించి ఇద్దరు, ఎన్నికల నేపథ్యంలో ప్రజల్ని భయాందోళనలకు గురిచేస్తున్న మరో ఇద్దరిపై జిల్లా బహిష్కరణ వేటు పడిన విషయం తెలిసిందే. జిల్లా ఎస్పీ గౌతమి శాలి సిఫార్సు మేరకు వారిని జిల్లా నుంచి బహిస్కరిస్తూ కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ముగ్గురిని జూలై 15వ తేదీ వరకూ బహిష్కరించగా, మిగిలిన ఐదుగురిపై మూడు నెలల పాటు ఆంక్షలు విధించారు. జిల్లా బహిష్కరణకు గురైన వారిలో అనంతపురంలోని రాణినగర్‌కు చెందిన కడపల వెంకట్రాముడు అలియాస్ వెంకటరమణ/కోడి వెంకట్రాముడు, బుడ్డప్పనగర్‌కు చెందిన షికారి భగవాన్, వేణుగోపాలనగర్‌లోని తారకరామాపురం కొట్టాలకు చెందిన చాకలి చలపతి అలియాస్ మీసాల చలపతి, గుంతకల్లులోని శాంతినగర్‌లో నివాసముంటున్న జి.మాబు అలియాస్ గాడి మాబు, గార్లదిన్నె నివాసి దూదేకుల అబ్దుల్ అలియాస్ అబ్దుల్లా, బెళుగుప్ప మండలం గంగవరం గ్రామానికి చెందిన అంకె నారాయణ అలియాస్ అంకె నారాయణస్వామి, కంబదూరులోని గుండ్లపల్లి కాలనీలోకి చెందిన ఎరికల ముత్యాలన్న అలియాస్ ముత్యాలప్ప/జోల్లోడు, ఎరికల శేఖర్ అలియాస్ ఎరికల రాజశేఖర్/గూండబండ ఉన్నారు.