
ఆకట్టుకున్న మాక్‌డ్రిల్
● శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా తాడిపత్రిలో పోలీసుల మాబ్ ఆపరేషన్
● రైలు ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు స్పందించే తీరుపై రైల్వే శాఖ ప్రదర్శన
తాడిపత్రి అర్బన్: కౌంటింగ్ రోజున శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు, ఆర్మ్‌డ్ రిజర్వ్, కేంద్ర పోలీసు బలగాలు తీసుకునే చర్యలపై తాడిపత్రిలోని జూనియర్ కళాశాల మైదానంలో బుధవారం నిర్వహించిన ‘మాబ్ ఆపరేషన్’ మాక్ డ్రిల్ ఆకట్టుకుంది. ఎస్పీ గౌతమిశాలి ఆదేశాలతో డీఎస్పీ జనార్దన్‌నాయుడు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరిగినపుడు ఎలా స్పందిస్తారో ప్రత్యక్షంగా ప్రజలకు చూపించారు. హింసాత్మక సంఘటన జరిగితే, గుంపును నియంత్రించేందుకు చేసే హెచ్చరికలను ప్రయోగాత్మకంగా చూపించారు. హెచ్చరిక వినకపోతే వారు మేజిస్ట్రేట్ అనుమతితో బాష్పవాయువు ప్రయోగం, తమను తాము రక్షించుకోవడానికి లాఠీ చార్జ్, ఆపై వాటర్ కెనాన్ వినియోగం తదితర అంశాలను క్షేత్రస్థాయిలో ప్రదర్శించారు. మాక్‌డ్రిల్‌లో పాల్గొన్న పోలీసులు ప్రతి సన్ని వేషాన్ని ఆద్యంతం రక్తికట్టించడంతో చూసిన ప్రజలు అవాక్కయ్యారు. తొలుత అక్కడ నిజంగానే యుద్ధవాతావరణం నెలకొందని కొందరు పరుగులు తీశారు. తర్వాత అక్కడున్న వారందరూ మఫ్టీలో ఉన్న పోలీసులేనని తెలుసుకుని ఆసక్తిగా గమనించారు.
గూళ్యపాళ్యం రైల్వేస్టేషన్‌లో...
గుంతకల్లు: రైలు ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు రైల్వే సాంకేతిక నిపుణులు, పారా మెడికల్ సిబ్బంది స్పందించే తీరుపై బుధవారం గూళ్లపాళ్యం రైల్వే స్టేషన్‌లో నిర్వహించిన మాక్ డ్రిల్ ప్రజలను అబ్బురపరిచింది. రైలు పట్టాలు తప్పిందంటూ డివిజన్ కేంద్రం గుంతకల్లులో అనౌన్స్‌మెంట్ జరిగిన వెంటనే ఆగమేఘాలపై అధికారులు, ఉద్యోగులు ఎలా స్పందిస్తారో ప్రత్యక్షంగా చూపించారు. ప్రత్యేక రైలుల్లో సేఫ్టీ, ఆపరేటింగ్, ఇంజనీరింగ్, కమర్షియల్, మెడికల్ విభాగాలకు చెందిన ఉన్నతాకారులతోపాటు సిబ్బంది ప్రమాదస్థలిని చేరుకుని విభాగాల వారిగా ఎవరికి వారు సహాయక చర్యలు చేపట్టే విధానాన్ని అందరూ రక్తికట్టించారు. మొత్తం ప్రక్రియను జోనల్ పీసీఎస్‌ఎం ప్రదీప్‌కుమార్, డిప్యూటీ సీఎస్‌ఓ అప్పారావు, డీఆర్‌ఎం వినీత్‌సింగ్, ఏడీఆర్‌ఎం సుధాకర్ తదితరులు పర్యవేక్షించారు. బోగీలను ఒకదానిపై ఒకటి ఎక్కించి ప్రమాద దృశ్యాన్ని కళ్లకు కట్టించారు. బోగిల్లో చిక్కుకున్న వారిని వెలికి తీయడం, గాయపడిన వారికి చికిత్సలు అందజేయడం, అంబులెన్స్‌లో తరలించడం, మంటలు చెలరేగితే ఆర్పే విధానం తదితర అంశాలను దాదాపు 3 గంటల పాటు ప్రదర్శించారు. కార్యక్రమంలో సీనియర్ డీసీఎం మనోజ్, సీనియర్ డీపీఓ జయశంకర్‌చౌహన్, సీనియర్ డీఈఎన్ కోర్డినేషన్ అక్కిరెడ్డి తదితర విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఆకట్టుకున్న మాక్‌డ్రిల్