
అనంతపురం కల్చరల్: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతులనే పూజించాలని వక్తలు పిలుపునిచ్చారు. ‘సాక్షి’ మీడియా గ్రూపు, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సంయుక్త ఆధ్వర్యంలో అనంతపురంలోని కోవూర్ నగర్‌లో ఉన్న విశ్వభారతి స్కూల్‌లో శనివారం ‘చిన్నారుల చేతుల్లో మట్టి గణపతి’ శిక్షణా శిబిరాన్ని నిర్వహించారు. ‘సాక్షి’ బ్రాంచ్ మేనేజర్ శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కిషోర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, ఉమామహేశ్వరి, విశ్వభారతి విద్యాసంస్థల కరస్పాండెంట్ అనసూయదేవి, ప్రముఖ నాట్యాచార్యులు సంధ్యామూర్తి, సంస్కార భారతి ప్రధాన కార్యదర్శి లక్ష్మి, సాక్షి బ్యూరో ఇన్‌చార్జి రామచంద్రారెడ్డి, ఎడిషన్ ఇన్‌చార్జి మహేశ్వరరెడ్డి, టీవీ కరస్పాండెంట్ శివారెడ్డి తదితరులు హాజరయ్యారు.
సృజన చాటిన విద్యార్థులు
వివిధ పాఠశాలల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన విద్యార్థులు సృజనాత్మకత ఉట్టిపడేలా మట్టితో వినాయకుడి ప్రతిమలు చేసి ఆకట్టుకున్నారు. మాస్టర్ ట్రైనర్‌గా ప్రముఖ చిత్రకారుడు కత్తి విజయ్‌కుమార్ వ్యవహరించి అందమైన ప్రతిమలను చేయించి అందరి మన్ననలందుకున్నారు. విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు రియాజుద్దీన్ శతక పద్యాలతో ఆలరించారు. విశ్వభారతి విద్యార్థులు శ్రీధరి, లక్ష్మీతన్మయి, శ్రీవల్లి... గణేశస్తుతితో భక్తిభావం పెంచారు. పాఠశాల నిర్వాహకులు సుగుణాకర్ మాట్లాడుతూ... వివిధ సామాజిక కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేసేలా ‘సాక్షి’ చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు దోహదపడతాయన్నారు.
విజేతలు వీరే..
చిన్నారుల చేతిలో మట్టి గణేశుడు కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా వివిధ స్కూళ్లకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై... ఒకే వేదికపై విభిన్న ఆకృతుల్లో గణపయ్యలను సిద్ధం చేశారు. అద్భుతమైన ప్రతిభతో సృజనను కనపరచిన విద్యార్థులకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. నగరానికి చెందిన సుధీర్, హన్విత, నవనీత్ తొలి మూడు స్థానాలను దక్కించుకోగా, యశ్వంత్, బాబా రహమత్, యుగంధర్, నేహశ్రీ, ప్రియవిద్య, సోఫియా, అమృత కన్సొలేషన్ బహుమతులందుకున్నారు.
సంతోషంగా ఉంది
నేను అనంతపురంలోని పొట్టి శ్రీరాములు స్కూల్లో 10వ తరగతి చదువుతున్నా. ఇటీవల మా స్కూల్‌లో సృజనాత్మక కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. ఈ రోజు నేను చేసిన మట్టి గణేశుడి ప్రతిమకు ప్రథమ బహుమతి రావడం ఎంతో సంతోషంగా ఉంది.
– సుధీర్, ప్రథమ బహుమతి విజేత
మా వాళ్లకు చూపిస్తా
మట్టి గణేశుడి కార్యక్రమానికి వెళ్లమని మా అమ్మ, నాన్న, టీచర్లు ప్రోత్సహించారు. ఈ సారి మంచి బహుమతి రావడం ఆనందంగా ఉంది. నా విజయానికి కారణమైన మట్టి గణపతిని మా వాళ్లందరికీ చూపిస్తా.
– హన్విత, ద్వితీయ బహుమతి విజేత
మా స్కూల్ వాళ్లు ప్రోత్సహిస్తారు
మా స్కూల్‌లోనే మట్టి గణపతుల తయారీపై శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి మట్టితో గణేశుడి ప్రతిమను చేయడంపై బాగా ప్రాక్టీస్ చేశా. దీనికి తోడు మా మేడం వాళ్లు బాగా ప్రోత్సహించారు. – నవనీత్, తృతీయ బహుమతి విజేత
‘సాక్షి’ మీడియా గ్రూపు, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సంయుక్త ఆధ్వర్యంలో శిక్షణ శిబిరం
ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతుల అందజేత
అనంతపురంలోని కోవూర్ నగర్ విశ్వభారతి స్కూల్ వేదికగా సందడి



