డ్రైల్యాండ్ హార్టికల్చర్‌కు అనుమతుల మంజూరు

● 5వేల ఎకరాల్లో పండ్ల మొక్కల సాగు లక్ష్యం
అనంతపురం టౌన్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పండ్ల తోటల పెంపకాని (డ్రైల్యాండ్ హార్టికల్చర్)కి పరిపాలన అనుమతులు మంజూరైనట్లు జిల్లా నీటియాజమాన్య సంస్థ (డ్వామా) ప్రాజెక్టు డైరెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఉపాధి హామీ ఏపీడీ, ఏపీఓలతో టెలికాన్ఫరెన్సు నిర్వహంచారు. పీడీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 5వేల ఎకరాల్లో పండ్ల మొక్కలను సాగు చేయాలని ఈ ఏడాది లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. పండ్ల మొక్కల గ్రౌండింగ్ పనులను వేగవంతంగా చేపట్టే దిశగా చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. పండ్ల మొక్కల సాగు కోసం దరఖాస్తు చేసుకున్న రైతులతో సమావేశాలు నిర్వహించి.. వారికి ఆసక్తి ఉన్న పండ్ల మొక్కల ఎంపిక ప్రక్రియను చేపట్టాలన్నారు. నెలాఖరులోపు రైతుల పొలాల్లో గుంతలు తవ్వే ప్రక్రియను పూర్తి చేసి మొక్కలు నాటేందుకు సిద్ధం చేయలన్నారు. వర్షాకాలం పూర్తయ్యేలోపు 100 శాతం మొక్కలు నాటే దిశగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు.
పాఠశాలల్లో మొక్కల పెంపకం
జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో మొక్కలు నాటేందుకు సన్నద్ధం కావాలని డ్వామా పీడీ సూచించారు. పాఠశాలల పునఃప్రారంభం కాగానే ఒక్కో విద్యార్థి ఒక మొక్క చొప్పున నాటించి వాటిని సంరక్షించే బాధ్యతలను కమిటీ సభ్యుల చేత చేపట్టే దిశగ చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకు కోసం గ్రామాల్లోని క్షేత్రసహాయకులు, మేట్లు ప్రత్యేక కార్యాచరణ చేపట్టే ఉపాధిహామీ సిబ్బంది మొక్కల పెంపకంపై అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు.