
అనంతపురం సప్తగిరి సర్కిల్: ప్రభుత్వ వైద్య కళాశాలలో బుధవారం సాయంత్రం ఐదు గంటలకు స్నాతకోత్సవం నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ నాగలక్ష్మి, లోక్‌సతా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ, నంద్యాల డిప్యూటీ కలెక్టర్ భరత్‌నాయక్, ఇన్‌కం ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీదేవి, ప్రభుత్వ సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రఘునందన్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్రహ్మణ్యం, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ షారోన్ సోనియా హాజరుకానున్నారు. 2017 బ్యాచ్‌కు చెందిన వైద్య విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయనున్నారు.
చర్యలపై నివేదిక పంపండి
అనంతపురం అర్బన్: ‘గడపగడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో గుర్తించిన సమస్యలపై తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను తక్షణం పంపించాలని జాయింట్ కలెక్టర్ కేతన్‌గార్గ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ రెవెన్యూభవన్‌లో ఈ అంశంపై అధికారులతో ఆయన సమీక్షించారు. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో 34 శాఖలకు సంబంధించి 2,708 సమస్యలను గుర్తించారన్నారు. వాటిపై తీసుకున్న చర్యల గురించి నివేదికను సీపీఓకు పంపించాలని ఆదేశించారు. ప్రధానంగా గుర్తించిన సమస్యల్లో ఆర్‌డబ్ల్యూఎస్ 444, ఐసీడీఎస్ 396, డీపీఓ 383, పంచాయతీరాజ్ 341, డీఈఓ 209, డీఎంహెచ్‌ఓ 173, అనంతపురం మునిసిపల్ కార్పొరేషన్ 165, జెడ్పీ సీఈఓ పరిధిలో 147, పశుసంవర్ధక శాఖ 82, వ్యవసాయ శాఖ 66, ఆర్టీసీ 55 సమస్యలు ఉన్నాయన్నారు.
పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు అనుమతించొద్దు
రాప్తాడురూరల్: రెగ్యులర్ పదో తరగతి పరీక్షలతో పాటు సార్వత్రిక విద్యా పీఠం (ఓపెన్ స్కూల్) పదో తరగతి, ఇంటర్ పరీక్షలు జరుగుతాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు అనుమతించొద్దని డీఈఓ సాయిరామ్ ఆదేశించారు. సోమవారం నగరంలోని ఉపాధ్యాయ భవన్‌లో ఓపెన్ స్కూల్ పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. డీఈఓ మాట్లాడుతూ ఓపెన్ స్కూల్ పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి జరుగుతాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 18 సెంటర్లను ఎంపిక చేశామని, మొత్తం 4,037 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారన్నారు. ప్రశ్నపత్రం లీక్ కాకుండా, మాస్ కాపీయింగ్ జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షలు పూర్తయ్యేంత వరకు అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ విధులను నిబంధనల ప్రకారంగా నిర్వర్తించాలని కోరారు.
ఉచిత సీట్ల వివరాలు
నోటీసు బోర్డులో ఉంచాలి
రాప్తాడురూరల్: విద్యాహక్కు చట్టం–2009 మేరకు 2023–24 విద్యా సంవత్సరంలో అన్ని ప్రైవేట్ స్కూళ్లలోనూ ఒకటో తరగతిలో పేద విద్యార్థులకు 25 శాతం కోటా సీట్ల అమలుపై ప్రతి పాఠశాలలోనూ నోటీస్ బోర్డులో ఉంచాలని డీఈఓ ఎం.సాయిరామ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 25 శాతం రిజర్వ్ చేసిన సీట్ల వివరాలను ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 10లోగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. తల్లిదండ్రులకు సాయం కోసం డీఈఓ కార్యాలయం, ఎంఈఓ కార్యాలయాలు, గ్రామ/వార్డు సచివాలయాల్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు.

మాట్లాడుతున్న డీఈఓ సాయిరామ్