మాడుగుల రూరల్ : గోవాడ సుగర్ ఫ్యాక్టరీకి 2024–25 క్రషింగ్ సీజన్‌కు సంబంధించి చెరకు సరఫరా చేసిన చెరకు బకాయిలు ఇప్పించాలని కోరుతూ మూడుసార్లు జిల్లా కలెక్టర్‌కు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసినా, సీఎంకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని కె.జె.పురం గ్రామానికి చెందిన విశ్వనాధ సుబ్బారావు మంగళవారం సాయంత్రం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. 31192 జనరల్ నెంబరుతో సుగర్ ప్యాక్టరీకి ప్రతి ఏటా గతంలో చెరకును సరఫరా చేసేవాడినని, గడిచిన 2024–25 క్రషింగ్ సీజన్‌కు సంబంధించి, 162 టన్నులు 968 కిలోల చెరకును సుగర్ ఫ్యాక్టరీకి సరఫరా చేసినట్టు తెలిపారు. దీంట్లో కేవలం 7 టన్నులు 3 కిలోల చెరకుకు సుమారు రూ.22,000 ఇవ్వగా, మిగిలిన 155 టన్నులు 965 కిలోలు చెరకుకు గాను సుమారు రూ.4,92,342 బకాయిలు రావాల్సి ఉందన్నారు. బకాయిలు కోసం పలు పర్యాయాలు గోవాడ సుగర్ ఫ్యాక్టరీకి వెళ్లి కోరినా పేమెంట్ ఇవ్వలేదన్నారు. తనకు ఆరోగ్యం బాగోలేదని, హృదయ సంబంధిత సమస్యల వల్ల విశాఖలో ప్రెవేటు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నామని, బకాయిల కోసం ఈ ఏడాది జనవరి 5, మార్చి 30న, ఏప్రిల్ 6వ తేదీన అనకాపల్లి జిల్లా కలెక్టర్‌కు పీజీఆర్‌ఎస్ ద్వారా ఫిర్యాదు చేశానన్నారు. అయినా అధికారుల నుంచి స్పందన లేదని, తనకు రావాల్సిన బకాయిలు రాక, ఆరోగ్యం బాగా లేక, ఇబ్బందులు పడుతున్నామన్నారు. గత నెల 13వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రికి రాత పూర్వకంగా బకాయిలు ఇప్పించాలని ఫిర్యాదు చేసినట్టు సుబ్బారావు పేర్కొన్నారు. కాగా ఈ సమస్యపై తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సుగర్స్ కమిషనర్ ఈ నెల 4న ఫ్యాక్టరీ మనేజింగ్ డైరెక్టర్‌కు లేఖ పంపడం జరిగిందని, అయినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. అలాగే 2023–24, 2024–25 క్రషింగ్ సీజన్‌లో చెరకు రవాణా చార్జీలు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.


