నేతలు హెల్మెట్‌ ధరించకపోతే రెట్టింపు జరిమానా | - | Sakshi
Sakshi News home page

నేతలు హెల్మెట్‌ ధరించకపోతే రెట్టింపు జరిమానా

May 6 2026 7:55 AM | Updated on May 6 2026 7:55 AM

● పోలీసులకు హోంమంత్రి అదేశం ● నక్కపల్లిలో బైక్‌ ర్యాలీ

నక్కపల్లి: రోడ్డు ప్రమాదాల నుంచి ప్రాణాలను కాపాడేందుకు బైక్‌లు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. హెల్మెట్‌ ధారణపై అవగాహన కల్పించేందుకు మంగళవారం అడ్డురోడ్డు నుంచి నక్కపల్లి వరకు జాతీయ రహదారిపై బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సురక్షిత రోడ్లు, సురక్షిత జీవితం అనే నినాదంతో సాగిన ఈ ర్యాలీ ద్వారా బైక్‌ వినియోగదారులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. రూ.రెండు లక్షలు పెట్టి బైక్‌ కొనేవారు ఐదొందలు పెట్టి హెల్మెట్‌ కొని ధరించడానికి వెనుకాడుతున్నారన్నారు. మీరు మీ కుటుంబం రోడ్డున పడకుండా సురక్షితంగా ఉండేందుకు హెల్మెట్‌ ధరించాలన్నారు. రాజరకీయ నాయకులు హెల్మెట్‌ ధరించకుండా వాహనం నడిపితే రెట్టింపు జరిమానా విధించాలని పోలీసులను ఆదేశించారు. ఈ విషయంలో ఎవరికి మినహాయింపు ఉండదన్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలు పలువురు ప్రాణాలు కోల్పోయారన్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించడం ద్వారానే వీటిని అరికట్టగలమన్నారు. ఈ ర్యాలీలో హెల్మెట్‌ ధరించి మంత్రి స్వయంగా బైక్‌ నడిపారు. ఈ ర్యాలీలో యువతీ యువకులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మోహన్‌రావు, సీఐలు మురళి, రామకృష్ణ, శంకర్రావు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement