నక్కపల్లి: మండలంలో డి.ఎల్.పురంలో సర్వే నంబరు 81లోని సుమారు 91 ఎకరాల్లో ఉన్న గోబందను ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని గ్రామ తాజామాజీ సర్పంచ్ కిల్లాడ రామకృష్ణ, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం. అప్పలరాజు ఆరోపించారు. మంగళవారం వారు గోబంద ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏన్నో ఏళ్ల నుంచి గ్రామానికి చెందిన వారు పశువులను మేపుకోవడంతో పాటు వాటికి నీరు పెట్టేందుకు దీనిని వినియోగిస్తున్నార ని చెప్పారు. ఈ బందలో డి.ఎల్.పురం మత్స్యకా రులు చేపలవేట చేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్నారన్నారు. పర్యావరణాన్ని కాపాడడంలో ఇటువంటి గోబందలు, చిత్తడి నేలలు ఎంతో కీలకమని చెప్పారు. ఆర్సిలర్‌మిట్టల్ నిప్పన్ స్టీల్‌ప్లాంట్‌వారు ఈ గోబందను ఆక్రమించి ఇక్కడ ఉన్న నీటిని ప్లాంట్ అవసరాలకోసం వినియోగించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే స్టీల్‌ప్లాంట్‌కు అవసరమైన నీటిని ఏలేరు, పోలవరం కాలువలనుంచి వాడుకునేందుకు రాష్ట్రప్రభుత్వం అనుమతించిందన్నారు. గోబందలో నీటిని ఎలా వినియోగించుకుంటారని ప్రశ్నించారు.ఇక్కడకు దేశ, విదేశపక్షులు వచ్చి జీవిస్తుంటాయన్నారు. గోబందపై సర్వాధికారాలు డి.ఎల్.పురం గ్రామస్తులకు చెందేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఆక్రమణకు గురికాకుండా, ఇక్కడ ఉన్న నీటి నిల్వలను ఫ్యాక్టరీలకు ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.ఈకార్యక్రమంలో సీపీఎం నాయకులు కోటేశ్వరరావు, కృష్ణంరాజు, సత్యనారాయణ, అప్పలనాయుడు, గోవిందు, అజయ్,నానాజీ తదితరులు పాల్గొన్నారు.


