మాట్లాడుతున్న వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్
మద్దిలపాలెం: ఏయూ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీలు విజయవంతంగా ముగిశాయని వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్ తెలిపారు. వర్సిటీ సిబ్బంది సమన్వయంతో నిర్వహించిన ఈ కార్యక్రమాలు ఉత్సవాలకు కొత్త ఉత్సాహాన్ని నింపడమే కాకుండా, సిబ్బంది మధ్య ఐక్యత, స్నేహభావాన్ని పెంపొందించడంలో కీలకపాత్ర పోషించాయన్నారు. సెనేట్ సమావేశ మందిరంలో స్పోర్ట్స్, గేమ్స్, కల్చరల్ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించిన రన్–అప్ టీమ్ సభ్యులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీల నిర్వహణలో రన్–అప్ టీమ్ చూపిన కృషి, కట్టుదిట్టమైన ప్రణాళిక, సమన్వయం అభినందనీయమన్నారు. శతాబ్ది ఉత్సవాలు కేవలం వేడుకలు మాత్రమే కాకుండా విశ్వవిద్యాలయ సాంస్కృతిక, క్రీడా, శాసీ్త్రయ వారసత్వాన్ని ప్రతిబింబించే వేదికగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రన్ అప్ టీమ్ సభ్యులకు జ్ఞాపికలు అందించి అభినందించారు. సమావేశంలో విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, ఆచార్యులు విజయమోహన్, హరనాథ్, వర్సిటీ అధికారులు మంజుల, సాంబమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.


